రంగు తగ్గితే పెళ్లవదని ఆడొద్దన్నారు…

రంగు తగ్గితే పెళ్లవదని ఆడొద్దన్నారు…

న్యూఢిల్లీ: సానియా మీర్జా.. ఇండియాలో చాలామంది అమ్మాయిలు టెన్నిస్‌‌ను సీరియస్‌‌గా తీసుకోవడానికి వెనుక కారణం ఆమె. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సానియా టెన్నిస్‌‌లో ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొంది. ‘ఎండలో ఆడి రంగు తగ్గితే.. నిన్ను ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. ఆ ఆట ఆపెయ్‌‌’ అంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను హెచ్చరించారు. అయితే ఎనిమిదేళ్ల వయస్సులో ఆ మాటలను పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ స్థాయికి చేరానని  సానియా తెలిపింది. ‘నేను టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ అవ్వాలనుకున్నప్పుడు పీటీ ఉష మాత్రమే నాకు ఆదర్శం. ఇప్పుడు సింధు, సైనా, దీపా కర్మాకర్‌‌ ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ దేశంలో అమ్మాయిలకు క్రీడల్లో తగిన ప్రోత్సాహం లేదు. నాకు ఎనిమిదేళ్లప్పుడు రంగు తగ్గితే నిన్ను ఎవ్వడూ పెళ్లి చేసుకోడు టెన్నిస్‌‌ ఆడొద్దు అని నాకు బాగా తెలిసిన వాళ్లే హెచ్చరించారు. అయితే వాటిని నేను పట్టించుకోలేదు అని’ గురువారం జరిగిన ఇండియా ఎకనమిక్‌‌ సమ్మిట్‌‌లో పాల్గొన్న సానియా చెప్పింది. విదేశీ టూర్లకు ఆటగాళ్లు తమ భార్యలను తీసుకెళ్లడానికి అనుమతివ్వాలని అభిప్రాయపడింది. ‘భార్య లేదా  పార్ట్​నర్స్​ ఉంటే ప్లేయర్లు డిస్ట్రాక్ట్‌‌ అవుతారంటూ మహిళలను బలహీనతగా చిత్రీకరిస్తున్నారు. వాళ్లువెంట ఉన్నప్పుడే ఆటగాళ్లు బాగా పెర్ఫామ్‌‌ చేస్తున్నారని గుర్తించాలి. విరాట్‌‌ డకౌటైతే అనుష్కకు ఏం సంబంధం. వరల్డ్‌‌కప్‌‌లో పాక్‌‌ జట్టు ఓడిపోతే నాకేం సంబంధం’అని ప్రశ్నించింది.