SBI వడ్డీరేట్లు మళ్లీ తగ్గాయ్‌‌!

SBI వడ్డీరేట్లు మళ్లీ తగ్గాయ్‌‌!

న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌‌ సంస్థ ఎస్‌‌బీఐ  అన్ని రకాల లోన్ల వడ్డీరేట్లను 10 బేసిస్‌‌ పాయింట్ల మేర తగ్గించింది. కొత్త రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాది ఎంసీఎల్‌‌ఆర్‌‌ రేటు 8.25 శాతం నుంచి రూ.8.15 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎస్‌‌బీఐ ఎంసీఎల్‌‌ఆర్‌‌ను తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. ఆగస్టులో ఆర్‌‌బీఐ రెపోరేట్లను తగ్గించింది. అప్పటి నుంచి ఎస్‌‌బీఐ రెండుసార్లు ఎంసీఎల్‌‌ఆర్‌‌కు కోతపెట్టింది. ఆగస్టులో 15 బేస్‌‌పాయింట్లు, ఇప్పుడు 10 బేస్‌‌ పాయింట్లు తగ్గించింది. ఎస్‌‌బీఐతోపాటు సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా, ఆక్సిస్‌‌ బ్యాంక్‌‌, ఓరియెంటల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌, ఐడీబీఐ బ్యాంక్‌‌, ఐడీఎఫ్‌‌సీ బ్యాంకులు కూడా ఆర్‌‌బీఐ రెపోరేటు ప్రకారం వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ క్యాలెండర్‌‌ సంవత్సరంలో ఆర్‌‌బీఐ రెపోరేటును 110 బేసిస్‌‌ పాయింట్లు తగ్గించింది. ఇదేస్థాయిలో బ్యాంకులు మాత్రం వడ్డీరేట్లను తగ్గించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి ఇచ్చే అన్ని లోన్లపై రెపోరేటు ప్రకారమే వడ్డీ వసూలు చేయాలని బ్యాంకులకు స్పష్టం చేసింది. ఎస్‌‌బీఐ ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్లపైనా వడ్డీరేట్లు తగ్గించింది. అన్ని టెనర్ల ఎఫ్‌‌డీలపై వడ్డీరాబడులకు 20–25 బేస్‌‌పాయింట్ల మేర కోత పెట్టింది. బల్క్‌‌ డిపాజిట్లపై వడ్డీ 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. కొత్త రేట్లన్నీ మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్‌‌బీఐ గత రెండు నెలల్లో మూడుసార్లు ఎఫ్‌‌డీ రేట్లను తగ్గించింది.

కొన్ని టెనర్లపై వడ్డీ యథాతథం

ఏడు రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌‌డీలపై వడ్డీశాతం యథాతథంగా 4.5 శాతమే ఉంటుంది. 46 రోజుల 179 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై వడ్డీ యథావిధిగా 5.50 శాతం ఉంటుందని ఎస్​బీఐ ప్రకటించింది.

కొత్త వడ్డీరేట్లు (సంఖ్యలన్నీ శాతాల్లో)

గడువు                                        ప్రస్తుత వడ్డీరేటు    కొత్త వడ్డీరేటు

7 రోజుల నుంచి 45 రోజుల వరకు            4.50          4.50

46 రోజుల నుంచి 179 రోజుల వరకు        5.50          5.50

180 రోజుల నుంచి 210 రోజుల వరకు           6          5.80

211 రోజుల నుంచి  ఏడాదిలోపు                  6          5.80

ఏడాది నుంచి  రెండేళ్ల వరకు                   6.70          6.50

రెండేళ్ల నుంచి  మూడేళ్లవరకు                  6.50          6.25

మూడేళ్ల నుంచి  ఐదేళ్ల వరకు                  6.25          6.25

ఐదేళ్ల  నుంచి పదేళ్ల వరకు                      6.25         6.25