డేటింగ్​ వెబ్​సైట్స్​తో మోసాలు

డేటింగ్​ వెబ్​సైట్స్​తో మోసాలు

ముగ్గురు అరెస్టు, మరో ముగ్గురు పరారీ

గచ్చిబౌలి, వెలుగు: డేటింగ్ వెబ్ సైట్ల పేరుతో మేల్ ఎస్కార్ట్స్ గా పంపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ శుక్రవారం వెల్లడించారు. సైబరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి  మేల్ ఎస్కార్ట్ జాబ్ కోసం కోల్ కత్తా వేదికగా రన్ అవుతున్న ఇండియన్ ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో నడిచే ఓ వెబ్​సైట్​లో రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు కంపెనీ నుంచి నేహ, రీమ, కరణ్ అనే అమ్మాయిలు కాల్ చేసి మేల్​ ఎస్కార్ట్​ జాబ్స్​ ఉన్నాయని, అందుకు డబ్బులు కట్టాలని  చెప్పారు. దీంతో వివిధ ఫీజుల రూపంలో సదరు వ్యక్తి రూ. 13, 82, 643 పేమెంట్​ చేశాడు.  ఆ తర్వాత  లేట్​ ఫీజు,  జీఎస్​టీ ఫీజులు అని చెప్పడంతో  మరో రూ. 1.50 లక్షలు వారు సూచించిన బ్యాంక్​ అకౌంట్​కు పంపించాడు. డబ్బులు కట్టిన తర్వాత జాబ్​ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్​ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

మరో కేసులో షాద్​నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ 15న ఫిమేల్ ఎస్కార్ట్​ జాబ్​ కోసం వెతుకుతూ ఓ వెబ్​సైట్​లో పోస్ట్ చూసి రిజిస్ర్టర్​ చేసుకున్నాడు. కొద్ది సమయానికి సదరు కంపెనీ నుంచి త్రిష అనే అమ్మాయి కాల్​ చేసి  జాయినింగ్ మెంబర్​ షిప్​ కోసం, జీఎస్టీ కోసం, హోటల్ బుకింగ్ కోసమని చెప్పి బాధితుడి వద్ద రూ. 1,15,700 కట్టించుకుంది. ఆ తర్వాత జాబ్ రాకపోవడంతో తనను చీటింగ్​ చేసినట్లు సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు కంప్లైంట్స్​ ఆధారంగా సైబర్​ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్​లో డేటింగ్​ వెబ్​సైట్ల పేరుతో మోసాలకు పాల్పడుతుంది వెస్ట్​బెంగాల్​కు చెందిన గ్యాంగ్​గా గుర్తించారు. ఈ గ్యాంగ్​లోని  బిజయ్​కుమార్, వినోద్ కుమార్, మహ్మద్ నూర్ ఆలమ్ అన్సారీలను  వెస్ట్​బెంగాల్​లో అరెస్ట్​ చేసి నగరానికి తీసుకువచ్చారు. మరో ముగ్గురు నిందితులు  సంతుదాస్​,  అమిత్​పాల్​,  సుషాంక్​కుమార్​లు పరారీలో ఉండగా, వారి ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. వీరి వద్ద నుంచి ఒక ల్యాప్​టాప్​, 31సెల్​ఫోన్లు,  12 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.