చదువు ఆపేసిన పిల్లలకి స్కాలర్‌‌‌‌షిప్‌‌లు ఇస్తుండు

చదువు ఆపేసిన పిల్లలకి స్కాలర్‌‌‌‌షిప్‌‌లు ఇస్తుండు

పిల్లలందరు బాగా చదివి లైఫ్‌‌లో మంచి పొజిషన్‌‌లోకి రావాలనుకుంటారు టీచర్లు. అందుకు స్టూడెంట్స్‌‌కు కావాల్సిన సలహాలు ఇవ్వడం, ఎక్స్‌‌ట్రా క్లాస్‌‌లు, ట్యూషన్‌‌లు చెప్పడం, ఫలానా దాంట్లో చదవండని సూచనలు ఇవ్వడం చేస్తుంటారు. కానీ, నారాయణ నాయక్‌‌ అలా కాదు. ఆర్థిక సమస్యల వల్ల చదువు ఆపేసిన పిల్లలకి స్కాలర్‌‌‌‌షిప్‌‌లు ఇప్పించడంలో సాయం చేస్తాడు. పై చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్నాడు.

ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేసే పిల్లల సంఖ్య వేలలో ఉంటుంది. అలాంటి పిల్లలు కుటుంబానికి సాయంగా ఉండేందుకు ఏదో ఒక పనిలో చేరుతున్నారు. నిజానికి డబ్బు లేక చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న పిల్లల కోసం ప్రభుత్వం, కొన్ని ఎన్‌‌జీవోలు ఆర్థిక సాయంగా స్కాలర్‌‌‌‌షిప్‌‌లు ఇస్తుంటాయి. కానీ, వాటిపై అవగాహన లేక చాలామంది వాళ్ల కోరికల్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. అలా ఇంకెవరూ చేయకూడదనే ఆలోచనతో స్కాలర్‌‌‌‌షిప్‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ ప్రోగ్రామ్‌‌ని మొదలుపెట్టాడు నారాయణ. రిటైర్‌‌‌‌ అయినా స్టూడెంట్సే నా ప్రపంచం అంటున్న 80 ఏండ్ల నారాయణ నాయక్‌‌ గురించి.

నాలా ఇంకెవరూ కాకూడదని

నారాయణది దక్షిణ కర్నాటకలోని కర్పె అనే మారుమూల పల్లెటూరు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచీ చదువంటే ఇష్టం. అందుకే కష్టమైనా రోజూ16 కిలోమీటర్లు నడిచి స్కూల్‌‌కి వెళ్లేవాడు. పెద్ద చదువులు చదివి మంచి జాబ్‌‌ తెచ్చుకోవాలని అనుకునేవాడు. కానీ, ఐదో క్లాస్‌‌లో చదువు మాన్పించి, పనికి తీసుకెళ్లాడు వాళ్ల తండ్రి. అప్పుడు చదువుకుంటానని ఇంట్లో గొడవ చేశాడు. కొన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నాడు. దాంతో చేసేదేం లేక మళ్లీ స్కూల్లో చేర్పించాడు తండ్రి. ఎనిమిదో క్లాస్ చదువుతున్నప్పుడూ మళ్లీ ఇదే జరిగింది. అప్పుడు కూడా గొడవ చేసి మరీ స్కూల్‌‌కి వెళ్లాడు. పది పూర్తవగానే ‘‘ఇక చదివింది చాలు. వచ్చి పొలం పనులు చెయ్యి. పై చదువులకోసం డబ్బులు కట్టలేమ’’ని అన్నారు తల్లిదండ్రులు. దాంతో నారాయణ సిటీకి వెళ్లి పార్ట్‌‌టైం జాబ్‌‌ చేస్తూ, వచ్చిన డబ్బుతో ఇంటర్మీడియట్‌‌తో పాటు బీఈడీ పూర్తి చేసి, 20 ఏండ్లకి ప్రైమరీ స్కూల్‌‌ టీచర్‌‌‌‌ జాబ్‌‌లో చేరాడు. 38 ఏళ్లు టీచర్‌‌‌‌గా చేసి, 2001లో  రిటైర్‌‌‌‌ అయ్యాడు. ఎంతో మంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దిన నారాయణను అందరూ ‘స్కాలర్‌‌‌‌షిప్‌‌ మాస్టర్‌‌‌‌’, ‘లైబ్రరీ ఆఫ్‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌’ అని పిలుస్తారు.

అప్లికేషన్లలోనూ సాయం

ప్రభుత్వం, కొన్ని ఎన్‌‌జీఓలు గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు స్టూడెంట్‌‌ స్కాలర్‌‌‌‌షిప్స్‌‌ ఇస్తుంటాయి. వాటిగురించి పిల్లలకు అవగాహన కల్పిస్తుంటాడు నారాయణ. చుట్టు పక్కల ఊళ్లలోని స్కూల్‌‌, కాలేజీలకు వెళ్లి  స్టూడెంట్స్‌‌ కోసం ఎలాంటి స్కాలర్‌‌‌‌షిప్స్‌‌ ఉంటాయి? వాటికి ఎలా అప్లై చేయాలి? అన్న విషయాలు చెప్తుంటాడు. దగ్గరుండి అప్లై చేయిస్తాడు కూడా. లేబర్‌‌‌‌, కాస్ట్‌‌, రెలిజియన్‌‌, మెరిట్‌‌ అని రకరకాల స్కాలర్‌‌‌‌షిప్స్‌‌ ఉంటాయి. 

వాటికి అర్హత ఉన్న పిల్లల లిస్ట్‌‌ తయారుచేసి ఎన్‌‌జీఓలకు ఇస్తుంటాడు. గత 22 ఏండ్లుగా దాదాపు 250 స్కూల్స్‌‌, కాలేజీల్లోని ఒక లక్షమంది పైగా స్టూడెంట్స్‌‌కి స్కాలర్‌‌‌‌షిప్స్ ఇప్పించాడు నారాయణ. ఆ డబ్బుతో చదువుకొని వివిధ రంగాల్లో జాబ్స్‌‌ చేస్తున్నారు చాలామంది. 

‘‘రిటైర్‌‌‌‌ అయ్యావు కదా. కుటుంబంతో టైం గడపక... నీకెందుకు ఇవన్నీ. ఎందుకింత కష్టపడుతున్నావ’’ని అంటుంటారు చాలామంది. చదువు కోవడం పిల్లల హక్కు.  డబ్బు లేకపోవడం వల్ల పిల్లలు దానికి దూరం కాకూడదని వాళ్లకు చెప్తుంటా. వాళ్ల భవిష్యత్తుకు ఉపయోగపడే స్కాలర్‌‌‌‌షిప్‌‌లు చాలానే ఉంటాయి. వాటి గురించి తెలుసుకో వాలి. నాకు ఎలాగో ఆ అదృష్టం దక్క లేదు. ఇప్పటి వాళ్లెందుకు ఈ అవకాశాల్ని వేస్ట్‌‌ చేసుకోవాలి” అంటాడు నారాయణ.