రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

HICCలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై ఇవాళ్టి కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. మధ్యాహ్నం వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత విజయ సంకల్ప సభ కోసం పరేడ్ గ్రౌండ్స్ కు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు HICC నుంచి హెలికాప్టర్ లో ప్రధాని మోడీ బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకుంటారు.  విజయ సంకల్ప సభ తర్వాత రాత్రికి రాజ్ భవన్ లో మోడీ బస చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఏపీ పర్యటనకు వెళ్లనున్న మోడీ.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

మరోవైపు.. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి భాగ్యలక్ష్మీ టెంపుల్ కు వచ్చారు యోగి. అక్కడ ఆలయ నిర్వాహకులు, పూజారులు యోగికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత అమ్మవారి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. భాగ్యలక్ష్మీ దేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్. ప్రత్యేక పూజల తర్వాత ఆలయ నిర్వాహకులు యోగితో పాటు నేతలను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట యోగీకి గజమాల వేశారు నేతలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు యోగీ ఆదిత్యనాథ్. ఇక యోగి రాక సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. పాతబస్తీలో యోగి టూర్ తో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు మోహరించాయి. షెడ్యూల్ ప్రకారం యోగి ఆదిత్యనాథ్ శనివారమే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. టైమ్ వీలు కాకపోవడంతో ఇవాళ చార్మినార్ కు వచ్చారు యోగి.