ప్లానింగ్ లోపం: యాదాద్రిలో రెండోసారి కొండ కటింగ్ 

ప్లానింగ్ లోపం: యాదాద్రిలో రెండోసారి కొండ కటింగ్ 
  • గిరి ప్రదక్షిణ దారిలో మెట్లు ఏర్పాటు చేసిన ఆఫీసర్లు
  • సీఎం ఆదేశాలతో కింద నుంచి దారి ఏర్పాటుకు చర్యలు
  • కేసీఆర్​ వచ్చిన ప్రతిసారీ తప్పని మార్పుచేర్పులు

యాదాద్రిలో సరైన ప్లాన్​ లేక కట్టుడు.. కూల్చుడే జరుగుతోంది. ఇప్పటికే పుష్కరిణికి మూడుసార్లు మార్పులు చేశారు. కాంప్లెక్స్ నిర్మాణం, శివాలయ ప్రహరీ విషయంలోనూ మొదట అనుకున్నదొకటి, చేసిందొకటి. ఇవే కాకుండా అనేక మార్పులు జరిగాయి. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం 100 మీటర్లకుపైగా కొండ ఎక్కి దిగేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని  కాదని కొండను తొలిచి రోడ్డు వేస్తున్నారు.

యాదాద్రి, వెలుగు: సరైన ప్లానింగ్​ లేకుండా యాదాద్రి పునర్నిర్మాణం పనులు సాగుతున్నాయి. తరచూ కట్టుడు.. కూల్చుడుతో ప్రజాధనం వృథా అవుతోంది. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుండడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. సీఎంగా కేసీఆర్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదగిరిగుట్టలోని లక్ష్మీ నృసింహస్వామి గుడిని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్​అథారిటీ(వైటీడీఏ) ఏర్పాటు చేసి రూ. 1,200 కోట్లు కేటాయించారు. ఏప్రిల్​ 2016 నుంచి టెంపుల్​ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడాలకు ప్లానింగ్​ సరిగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. తరచూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించడానికి ఇప్పటికి 15 సార్లు వచ్చిన సీఎం కేసీఆర్, వచ్చిన ప్రతిసారి మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత పలు మార్పులు జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం
మెట్ల ఏర్పాటుపై సీఎం సీరియస్​
కొండ చుట్టూ ఏర్పాటు చేసే రింగ్​రోడ్డు నిర్మాణం కోసం మొదట కొండ పశ్చిమ భాగంలో ఎడమవైపున ఉన్న ఓ లాడ్జ్ నుంచి యాదవ నగర్ మీదుగా రోడ్డు కోసం మార్కింగ్ చేశారు. భూసేకరణ, నష్ట పరిహారం చెల్లించడం వంటివి ఎందుకున్న ఉద్దేశంతో ప్లాన్​చేంజ్​ చేశారు. దీంతో రింగ్​రోడ్డును కొండవైపు జరపడంతో గతంలోనే 10 ఫీట్ల వరకు కొండను తొలిచారు. అయితే లాడ్జ్​ ఉన్న స్థలం వద్దకు వచ్చేసరికి.. రోడ్డు మరింత ఇరుకుగా మారింది. దీంతో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం 100 మీటర్లకు పైగా కొండ ఎక్కి దిగేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు చేశారు. జూన్​ 21న యాదాద్రికి వచ్చిన  సీఎం కేసీఆర్​మెట్లను చూసి సీరియస్​అయ్యారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మెట్లు ఎక్కి దిగగలరా అని ప్రశ్నిస్తూ కొండ కింది నుంచే మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థలం లేదంటూ ఆఫీసర్లు చెప్పడంతో అవసరమైనంతగా కొండను తొలవండి అంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో కొండను మరోసారి తొలుస్తున్నారు. అయితే యాదాద్రి కొండ మట్టి రాళ్లతో కూడుకున్నందున తరచూ తొలవడం వల్ల  భారీ వర్షాలు పడినప్పుడు మట్టి కుంగి రాళ్లు కిందికి పడే ప్రమాదం ఉంది..
గతంలోనూ పలు మార్పులు
గతంలోనూ ఆలయానికి సంబంధించిన పలు పనుల్లో మార్పులు చేశారు. -స్వామి వారిని ఊరేగించడానికి ఉపయోగించే  రథం కోసం మొదట క్యూ కాంప్లెక్స్ పై రథ మండపం నిర్మించారు. ఆలయ రాజ గోపురాలు కన్పించడం లేదని దానిని తొలగించారు. మళ్లీ పశ్చిమ, ఉత్తర రాజగోపురాల మధ్య ఏర్పాటు చేశారు. 
  -కొండపై ఉన్న పుష్కరిణికి మూడుసార్లు మార్పు చేర్పులు చేశారు. స్వామి కోసం కొండపైన, భక్తుల కోసం కొండ కింద పుష్కరిణి 
నిర్మిస్తున్నారు. 
 -కొండపై నిర్మించిన కాంప్లెక్స్​లో మొదట పదివేల మందితో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించాలని అనుకున్నారు. ఇప్పుడు కొండ కింద నిర్మిస్తున్నారు. కాంప్లెక్స్​లో భక్తుల కోసం క్యూ లైన్లు నిర్మిస్తున్నారు. 
 -కొండపైన శివాలయ ప్రహరీని నిర్మించి తొలగించారు. శివాలయం ఆవరణలో మొదట నిర్మించిన రామాలయాన్ని తొలగించారు. 
  --సాయిల్​ టెస్టింగ్​ చేయకుండా ఆలయం చుట్టూరా ఫ్లోరింగ్​వేశారు. వర్షాల కారణంగా కుంగిపోవడంతో సాయిల్​ టెస్టింగ్​చేయించి మళ్లీ ఫ్లోరింగ్​వేశారు. 
  -భక్తుల కోసం తులసి వనంలో బోటింగ్​ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని తొలగించి కొండపైకి చేరుకోవడానికి ఫ్లైఓవర్​ కోసం పిల్లర్లు వేస్తున్నారు. 
  -యాదాద్రిలో గిరి ప్రదక్షిణ కోసమని గండి చెరువువైపున కొండను పూర్తిగా తొలిచారు. ఆ తర్వాత దాన్ని అలాగే వదిలేసి కొండ చుట్టూ రింగ్​ రోడ్డు నిర్మిస్తున్నారు. 
  -టెంపుల్​సిటీకి వెళ్లడానికి వేసిన రోడ్లకు ఇనుప జాలీలతో గోడలు నిర్మించారు. భారీ వర్షాలకు ఈ గోడలు కూలిపోవడంతో  ఈసారి రిటర్నింగ్​వాల్​ఏర్పాటు చేశారు. 
-గతంలో కొండ మీదకు వెళ్లడానికి వీలుగా ఫ్లై ఓవర్​వేయడానికి వీలుగా ఆరు పిల్లర్లు వేశారు. ఆ తర్వాత వాటిని తొలగించి కొంతదూరంలో ఇప్పుడు మళ్లీ వేస్తున్నారు.
రోడ్డు హైట్​.. సర్కిల్​ డౌన్​
యాదాద్రి టెంపుల్​రాజగోపురం నుంచి బస్టాండ్​ వరకూ రెండు సర్కిల్స్​ఏర్పాటు చేస్తున్నారు. రాజగోపురం వద్ద ఇప్పటికే సర్కిల్​ పూర్తికాగా.. పాత గుట్ట వైపు వెళ్లడానికి వీలుగా మరో సర్కిల్​ ఏర్పాటు చేయాల్సి ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా రింగ్​రోడ్డు చేరుకోవడానికి ఏర్పాటు చేస్తున్న క్రమంలో స్థానికులకు సంబంధించి కార్లు తదితర వెహికల్స్​ వెళ్లడానికి వీలుగా అండర్​పాస్​నిర్మిస్తున్నారు. దీంతో మెయిన్​రోడ్డు హైట్​పెరిగి, రింగ్​రోడ్డు డౌన్​ కావడంతో పాటు రాజగోపురం వద్ద సర్కిల్​ డౌన్​ అయిపోయింది. రోడ్డు హైట్​ పెరిగిన కారణంగా దగ్గరికి వెళ్తేనే రాజగోపురం పూర్తిగా భక్తులకు కన్పించే అవకాశం ఉంది.