మొక్కను చూస్తె చెల్లె గుర్తొస్తది

మొక్కను చూస్తె చెల్లె గుర్తొస్తది

ఆగస్టు 15.. అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్య్ర దినోత్సవం. కానీ, ఈసారి ఇంకొంచెం స్పెషల్‌‌ ఆ పండగ. కారణం, అన్నాచెల్లెళ్ల పండుగ రాఖీ కూడా ఆ రోజే కాబట్టి. మరి పండుగ అయిపోయాక ఆ రాఖీలు ఏమవుతున్నాయి? ఇప్పటికే పేరుకుపోయిన చెత్తకు ఇంకాస్త యాడ్‌‌ అవుతున్నాయి. కాలుష్యం ఇంకొంచెం ఎక్కువవుతోంది.  ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా 118 కోట్ల టన్నుల కార్బన్‌‌ గాల్లో కలుస్తోంది. అందుకే దానికి చెక్‌‌పెట్టేందుకు  కొన్ని స్టార్టప్‌‌లు కొత్తగా ఆలోచించాయి. ప్లాస్టిక్‌‌ లేని రాఖీలను రెడీ చేస్తున్నాయి. ఫిక్కీ లేడీస్‌‌ ఆర్గనైజేషన్‌‌, మహిళా స్వయం సహాయక బృందాలతో కలసి సీడ్‌‌ రాఖీలను తయారు చేస్తున్నాయి. పండుగ అయిపోయాక వాటిని నాటితే మొక్కలవుతాయని చెబుతున్నాయి.

మామూలు రాఖీల్లో రంగురంగుల రాళ్లు, మెరిసే వస్తువులను వాడుతుంటారు. పండుగ అయిపోయాక వాటితో ఉపయోగం ఉండదు. పైగా పడేస్తే చెత్తయిపోతున్నాయి. అందుకే కొత్త తరహాలో రాఖీలను చేసేందుకు రెండేళ్లు బాగా ఆలోచించి సరికొత్త సీడ్‌‌ రాఖీలను తీసుకొస్తున్నామని స్టార్టప్‌‌ కంపెనీ ఇన్‌‌డిబ్ని చెప్పింది. ఇండియాను పరిశుభ్రంగా, ఆకుపచ్చగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నామంది. ‘బియ్యం, తులసి, బొప్పాయి, అమాల్టస్‌‌, సన్‌‌ఫ్లవర్‌‌ విత్తనాలతో రాఖీలు చేస్తున్నం. ఈ ఏడాది సుమారు 30 వేల ఇలాంటి రాఖీలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నాగ్‌‌పూర్‌‌, కేరళ, రాజస్థాన్‌‌లలోని స్వయం సహాయక బృందాలకు ఇందుకోసం ట్రైనింగ్‌‌ ఇస్తున్నాం. బయట కూడా క్యాంప్‌‌లు పెట్టి ట్రైనింగ్‌‌ ఇస్తున్నాం’ అని ఇన్‌‌డిబ్ని కో ఫౌండర్‌‌ నితిన్‌‌ జైన్‌‌ చెప్పారు. రాఖీల కిట్‌‌తో కొబ్బరి, ఎరువులను, చేతితో చేసిన డైరీని కూడా ఇస్తున్నామని, కిట్‌‌ కూడా ఈజీగా రీ సైకిల్‌‌ అయ్యేదేనని వివరించారు.    ఇండిబ్నితో పాటు మరో సంస్థ అనంతయ కూడా వీటిని తయారు చేస్తోంది. యునెస్కో సేల్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌ అవార్డును ఈ సంస్థ ఐదు సార్లు గెలుచుకుంది. ఆగస్టు 15న రాఖీ పండుగ వస్తోంది కాబట్టి సరికొత్త ఎకో ఫ్రెండ్లీ జాతీయ జెండా రంగులో రాఖీలను రెడీ చేస్తున్నామంటోంది.