ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి:నాగం

ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి:నాగం

నాగర్​కర్నూల్/కందనూలు, వెలుగు: మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత నాగం జనార్ధన్​ రెడ్డి శనివారం చేపట్టిన మార్కండేయ లిఫ్ట్​పనుల పరిశీలన ఉద్రిక్తతకు దారి తీసింది.  నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్​పల్లి సమీపంలోని పైలాన్​ సమీపంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ​లీడర్లు, కార్యర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్​ లీడర్​ వాల్యానాయక్​ను చుట్టుముట్టిన బీఆర్ఎస్ ​కార్యకర్తలు ఆయనను కిందపడేసి గొంతుపై కాలు పెట్టి తొక్కారు. తోపులాట, వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంత గొడవ జరుగుతున్నా సమీప పరిసరాల్లో ఎక్కడా పోలీసులు కనిపించలేదు. ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకే నాగం వస్తున్నాడని బీఆర్ఎస్ ​లీడర్లు బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్​గౌడ్, వైఎస్ ఎంపీపీ చిన్నారెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ లీడర్లను సైట్​ దగ్గరికి పోనివ్వబోమని పట్టుబట్టారు. కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు వెనుదిరగడంతో వివాదం సద్దుమణిగింది. 

7,310 ఎకరాలకు నీరిచ్చేందుకు..

నాగర్​కర్నూల్​ నియోజకవర్గం బిజినేపల్లి మండలం నుంచి వెళ్లే కేఎల్ఐ ప్యాకేజీ 29లోని  మెయిన్​కెనాల్​నుంచి నీటిని మార్కండేయ చెరువుకు లిఫ్ట్​ చేసి 5 గ్రామాలు,17 గిరిజన తండాల్లోని 7,310 ఎకరాలకు  సాగునీరు అందించే పనులకు 2022లో మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. పరిపాలన అనుమతులిచ్చి చేతులు దులుపుకొన్నారని నాగం శుక్రవారం నాగర్​కర్నూల్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కండేయ లిఫ్ట్​ పైలాన్​నుంచి పనులను పరిశీలిస్తామని  ప్రకటించారు. శనివారం ఉదయం నాగం నాయకత్వంలో పైలాన్​ వద్దకు వెళుతుండగా బీఆర్ఎస్​ లీడర్లు అడ్డుకున్నారు. నాలుగేండ్ల కింద మొదలుపెట్టిన మార్కండేయ లిఫ్ట్​లో ఇప్పటివరకు తట్టెడు మన్నూ తీయలేదని నాగం ఆరోపించారు. అవసరమైతే శిలాఫలకం వద్ద దీక్షకు కూర్చుంటానని చెప్పారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఘర్షణపై కాంగ్రెస్​ లీడర్లు బిజినేపల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.