మెట్రోను మేడ్చల్ వరకు పొడిగించాలి.. ఎస్ఎఫ్ఐ నేతల డిమాండ్

మెట్రోను మేడ్చల్ వరకు పొడిగించాలి.. ఎస్ఎఫ్ఐ నేతల డిమాండ్
  • ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి
  • ఈ రెండు అంశాలను మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించకపోతే ఆందోళన చేస్తం

మేడ్చల్, వెలుగు: మెట్రో రైలు నిర్మాణాన్ని మేడ్చల్ వరకు పొడిగించాలని, పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలపై మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడకపోతే ‘చలో అసెంబ్లీ’ నిర్వహిస్తామని హెచ్చరించారు. గురువారం ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ఉన్న వివేకానంద విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ.. మేడ్చల్​లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని 2007 నుంచి డిమాండ్ ఉందన్నారు. తనను గెలిపిస్తే డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానని 2018లో అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో చెప్పిన మంత్రి మల్లారెడ్డి తర్వాత మాట తప్పారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి రాని పర్మిషన్.. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీకి ఎలా వస్తదని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రశ్నించారు. మెట్రోను కండ్లకోయ వరకు తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పారని.. దాన్ని మేడ్చల్ వరకు పొడిగించాలని కోరారు.  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు, మేడ్చల్ వరకు మెట్రో.. ఈ రెండు అంశాలపై ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. రాస్తారోకోలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోశ్, నాయకులుపాల్గొన్నారు.