థరూర్‌‌‌‌పై వ్యతిరేకత.. గెహ్లాట్‌‌ కండిషన్లు!

థరూర్‌‌‌‌పై వ్యతిరేకత.. గెహ్లాట్‌‌ కండిషన్లు!
  • పార్టీ ప్రెసిడెంట్​ ఎన్నికపై కాంగ్రెస్​లో గందరగోళం
  • థరూర్‌‌‌‌పై వ్యతిరేకత.. గెహ్లాట్‌‌ కండిషన్లు!
  • సొంత రాష్ట్రం నుంచే  శశిథరూర్‌‌‌‌కు సెగ
  • సీఎం పదవి విషయంలో గెహ్లాట్‌‌ ఆందోళన
  • రాహులే ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు

న్యూఢిల్లీ/అలప్పుజ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై అప్పుడే గందరగోళం మొదలైంది. తాము పోటీలో ఉంటున్నట్లు ఏ ఒక్కరూ ప్రకటించకున్నా.. అసమ్మతి మొదలైంది. దాదాపు 22 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో శశిథరూర్, అశోక్ గెహ్లాట్ పోటీలో ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి, తన పోటీ గురించి శశిథరూర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ థరూర్ సొంత రాష్ట్రమైన కేరళలోనే ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మరోవైపు పోటీ చేసేందుకు రెడీగానే ఉన్న అశోక్ గెహ్లాట్ మాత్రం కొన్ని ‘కండిషన్లు’ పెడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నిక జరగకపోవచ్చని, కాంగ్రెస్‌‌ అధ్యక్షుడిగా మరోసారి రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ చీఫ్‌‌గా రాహులే ఉండాలని ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు.. తీర్మానాలు చేసి పంపాయి. ఈనెల 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్లకు ఈ నెల 30 దాకా గడువు ఉన్న నేపథ్యంలో మరింత మంది పోటీలో ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడే ఇంత గందరగోళం నెలకొంటే.. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతున్నది.

రాహులే కావాలి: కేరళ ఎంపీలు

తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌‌‌‌పై సొంత రాష్ట్రమైన కేరళలోనే సెగ మొదలైంది. ఆయన పోటీకి దిగే విషయంపై ఇద్దరు ఎంపీలు కోడికున్నిల్ సురేశ్, కె.మురళీధరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ ఇష్టపకపోతే.. ఏఐసీసీ, మెజారిటీ లీడర్లు, కార్యకర్తలు ఆమోదించిన వ్యక్తి చీఫ్‌‌గా బాధ్యతలు చేపట్టాలి. కేరళ పీసీసీ ఇదే కోరుకుంటున్నది” అని సురేశ్ చెప్పారు. నెహ్రూ కుటుంబ ప్రాముఖ్యతను గుర్తించిన వారికే రాష్ట్ర యూనిట్ ఓటు వేస్తుందని మురళీధరన్ స్పష్టం చేశారు.

గెహ్లాట్.. అటు ఏఐసీసీ.. ఇటు సీఎం పదవి

ఏఐసీసీ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను గెహ్లాట్ ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేసేలా తాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నారు. కానీ గెహ్లాట్ పోటీకి సిద్ధంగానే ఉన్నారని, వచ్చే సోమవారం నామినేషన్ వేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక వేళ తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తే.. రాజస్థాన్ సీఎం పదవిలో తన నమ్మకస్తుడినే కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా కుదరకపోతే.. అటు వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా, ఇటు సీఎంగా తానే కొనసాగుతానని గెహ్లాట్ ప్రతిపాదన పెట్టారని సమాచారం. ఈ క్రమంలో సోమవారం సచిన్ పైలట్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.

నేను న్యూట్రల్‌‌గా ఉంట: సోనియా

కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీని సోమవారం ఢిల్లీలో శశిథరూర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎవరైనా పోటీ చేయవచ్చని, తాను మాత్రం న్యూట్రల్‌‌గానే ఉంటానని సోనియా తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సోనియాతో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న పాదయాత్రలో రాహుల్ వెంట ఉన్న ఆయన.. సోనియాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లడం గమనార్హం. ‘‘కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఏ సభ్యుడైనా ముందుకు రావచ్చు. ఇది ప్రజాస్వామ్య, పారదర్శక ప్రక్రియ. పోటీ చేసేందుకు ఎవరి అనుమతి అవసరంలేదు’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ట్వీట్ చేశారు.

దాదాపు 22 ఏండ్ల తర్వాత..

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దాదాపు 22 ఏండ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 1998 నుంచి సుదీర్ఘ కాలంపాటు పార్టీ అధినేత్రిగా సోనియానే ఉన్నారు. మధ్యలో 2017 నుంచి 2019 దాకా మాత్రమే ఏఐసీసీ చీఫ్‌‌గా రాహుల్ గాంధీ ఉన్నారు. చివరి సారిగా 2000 నవంబర్‌‌‌‌లో ఎన్నికలు జరగగా.. జితేంద్ర ప్రసాదపై సోనియా గెలిచారు.1997లో జరిగిన ఎన్నికలో రాజేశ్ పైలట్, శరద్ పవార్‌‌‌‌పై సీతారాం కేసరి గెలిచారు. ఇప్పుడు ఎన్నిక అనివార్యమైతే 22 ఏండ్ల తర్వాత నాన్ గాంధీ నేత ప్రెసిడెంట్‌‌ అవుతారు.