MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని

MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని

భారత జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఎంఎస్ ధోని.. ఇటీవల ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు బీసీసీఐ కార్యాలయానికి వెళ్లిన ధోని.. అక్కడ కాసేపు కలియ తిరిగారు. కొన్ని ఫోటోలపై ఆటోగ్రాఫ్ చేశారు. అదే సమయంలో 2011 ప్రపంచ కప్ ట్రోఫీని తాకారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. తాను గెలిపించిన ట్రోఫీని తాకాలన్న ఉదేశ్యంతోనే.. మహేంద్రుడు అలా చేశారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధోనీకి అదే ప్రశ్న ఎదురైంది. ప్రపంచ కప్ ట్రోఫీని ఎందుకు తాకారని హోస్ట్ ప్రశ్నించారు. అందుకు బదులిచ్చిన మాజీ కెప్టెన్.. ట్రోఫీ వంగి ఉండటంతో దానిని సవరించానని తెలిపారు. అందులో మరో ఉద్ధేశ్యమేమీ లేదని నవ్వుతూ సమాధానమిచ్చారు.

"వాంఖడేలో మ్యాచ్‌కు ముందు మీరు 2011 ప్రపంచ కప్ ట్రోఫీని మళ్లీ కలుసుకున్నారు. అలా ట్రోఫీని చూస్తున్నప్పుడు మీ మదిలో మెదిలిన మొదటి ఆలోచనలు ఏమిటి?" అని హోస్ట్ ప్రశ్నించింది. అందుకు ధోని స్పందిస్తూ.. "బీసీసీఐ ఆఫీసులో కొన్ని పునరుద్ధరణలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ట్రోఫీలు ఉంచిన కార్యాలయంలోని పై అంతస్తుకు వెళ్లాను. అక్కడున్న ట్రోఫీలు చూస్తున్నపుడు.. 2011 ప్రపంచ కప్ కాస్త వంగినట్లు కన్పించింది.. దానిని సరిచేశాను.." అని ధోని మాట్లాడారు.

శ్రీలంకను ఓడించి.. 

 1983 తర్వాత భారత జట్టు గెలిచిన రెండో వన్డే ప్రపంచ కప్.. 2011. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ధోని సేన 2011 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ 48.2 ఓవర్లలో దానిని ఛేదించింది. గౌతమ్ గంభీర్ (97), ఎంఎస్ ధోని (91*) స్టార్ పెర్ఫార్మర్లు కాగా, విరాట్ కోహ్లి (35), యువరాజ్ సింగ్ (21*) భారత్ పరుగుల వేటలో సహకారం అందించారు.