అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్: రంగంలోకి ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. షేర్లపై ప్రభావం

అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్: రంగంలోకి ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. షేర్లపై ప్రభావం

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి గడ్డుకాలం కొనసాగుతోంది. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) సంస్థలు, వాటి ప్రమోటర్ అనిల్ అంబానీ లక్ష్యంగా భారీ బ్యాంకింగ్ అండ్ కార్పొరేట్ మోసాలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్.. ఈ విచారణను నిష్పక్షపాతంగా, వేగంగా.. పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ ఇప్పటివరకు జరిపిన విచారణపై అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. వచ్చే 4 వారాల్లో కొత్త స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని ఆదేశించింది. రిలయన్స్ ఏడీఏజీకి చెందిన వివిధ సంస్థల ద్వారా ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించారని, ఆర్థిక నివేదికలను తారుమారు చేశారని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించడానికే ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాయని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనపై కోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. అనిల్ అంబానీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. అంబానీ భారత్‌లోనే ఉంటారని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లబోరని హామీ ఇచ్చారు. లుక్ అవుట్ సర్క్యులర్లు ఇప్పటికే అమలులో ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనిల్ అంబానీ, ఏడీఏజీ గ్రూప్ స్పందించడానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.

►ALSO READ | నిమిషాల్లో రూ.50వేల కోట్లు ఆవిరి.. 30 నెలల దిగువకు ఇన్ఫోసిస్ స్టాక్.. ఏం జరుగుతోంది?

ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ గ్రూప్ షేర్లపై ఈ వార్త భారీగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, వ్యవస్థాగత అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ విచారణ మొదలైతే.. మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ ఏడీఏజీ సామ్రాజ్యంలో నెలకొన్న సంక్షోభం ఈ విచారణతో కొత్త మలుపు తిరగనుంది. అంబానీ గ్రూప్ కంపెనీల భవిష్యత్తు ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఇచ్చే రిపోర్టుపైనే ఆధారపడి ఉందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.