హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ( సంజీవ రెడ్డి నగర్) పరిధిలోని దాసారం బస్తీలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బస్తీ సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఓ బిల్డర్ ప్రయత్నించడంతో స్థానికులు తిరగబడ్డారు. తమకు ఉన్న ఏకైక దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బిల్డర్‌కు మద్దతుగా పాత బస్తీకి చెందిన బౌన్సర్లు రంగంలోకి దిగారు. బస్తీ వాసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.దాడిలో పలువురు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు.
►ALSO READ | కూకట్ పల్లి GHMC ఆఫీసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ SE చిన్నారెడ్డి
35 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని.. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్లేందుకు మరో చోటు లేదంటూ కాలనీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలను శాంతింపజేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
