వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిల జట్టు మరోసారి అదరగొట్టింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరుకుంది. గత మూడు ఎడిషన్లలో చేజారిన కప్పును ఈసారైనా అందుకునేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచింది. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించిన ఢిల్లీ మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బాల్స్‌లో 6 ఫోర్ల 62 నాటౌట్ ) ఫిఫ్టీతో రాణించింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (6)తో పాటు కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (0), కనిక అహూజ (6), అనుష్క శర్మ (16) నిరాశపరచడంతో ఓ దశలో 59/4తో నిలిచిన జట్టును మూనీ ఆదుకుంది.
జార్జియా వారెహమ్ (35) తో కలిసి ఐదో వికెట్‌కు 61 రన్స్, చివర్లో కశ్వీ గౌతమ్ (18)తో ఏడో వికెట్‌కు 38 రన్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించింది. డీసీ బౌలర్లలో చినెల్లీ హెన్రీ (3/35) మూడు వికెట్లతో గుజరాత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. నందిని శర్మ (2/44) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. అనంతరం టాపార్డర్ బ్యాటర్లంతా సత్తా చాటడంతో ఢిల్లీ 15.4 ఓవర్లలోనే 169/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
స్టార్టింగ్ నుంచే ధాటిగా ఆడిన ఓపెనర్లు లిజెల్లీ లీ (24 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), షెఫాలీ వర్మ (21 బాల్స్‌లో 7 ఫోర్లతో 31) తొలి వికెట్‌కు 89 రన్స్ జోడించి విజయానికి బాటలు వేశారు. ఆపై కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), లారా వోల్‌వార్ట్ (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో వారెహమ్ రెండు వికెట్లు తీసింది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరిగే ఫైనల్లో ఆర్సీబీతో ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనుంది.
