ముషీరాబాద్, వెలుగు: గుర్తింపు కమిటీతో తొమ్మిదేండ్ల పోరాటం ఫలించిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు.
ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు మరచిపోయిన సందర్భంలో గుర్తింపు కమిటీ ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు.
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాదిరిగానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ను పలుమార్లు కోరామని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఉద్యమకారులను ఏకం చేసి సమస్యలను ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమాన్ని రాష్ట్ర రాజకీయ అజెండాగా మార్చడంలో కీలక పాత్ర పోషించామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల డిమాండ్లను చేర్చించడంలో ఫోరం ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో భాగమైన ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు.
