తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

తాగునీటి సమస్య  తలెత్తకుండా చూడాలి : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌ లో అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే రిపేర్లు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వార్డులు, గ్రామాల్లో బోర్లకు రిపేర్లు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నీటి పొదుపుపై  ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. 

దీర్ఘకాలంగా లాభాలు అందించే ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని  వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజి, శ్రీనివాసరెడ్డి, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో గీత, జడ్పీ సీఈవో పవన్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.