వెలుగు స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఇండియా అంటే కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. అది ఒక మహా శక్తి. ఆ శక్తి ఇప్పుడు కేవలం బ్లూ కలర్ జెర్సీకే పరిమితం కాకుండా ఖండాంతరాలు దాటింది. శనివారం మొదలయ్యే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఓ కీలక ఘట్టానికి సాక్ష్యం కానుంది. ఇండియాతో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లలో 30 కంటే ఎక్కువ మంది మన దేశ సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ముఖ్యంగా కెనడా, అమెరికా, ఒమన్, యూఏఈ వంటి జట్లను గమనిస్తే అవి మినీ ఇండియా టీమ్స్‌గా కనిపిస్తున్నాయి. కెనడా జట్టులో ఏకంగా 11 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉండగా.. అమెరికా టీమ్‌లో 9 మంది మన దేశ మూలాలున్న క్రికెటర్లు ఉన్నారు.
ఒమన్, యూఏఈ జట్లు చెరో ఏడుగురు ఆటగాళ్లతో మన ముద్రను చాటుతున్నాయి. తమ మూలాలున్న మట్టిపై, తమ వారసత్వ గడ్డపై పరుగుల వర్షం కురిపించేందుకు, వికెట్లు పడగొట్టేందుకు ఈ ‘ప్రవాస సైన్యం’ సిద్ధమైంది. ఈ సైన్యంలో ప్రత్యేకంగా నిలుస్తున్న కొందరు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్పెషల్ డెలివరీ ( సౌరభ్ నేత్రావల్కర్–అమెరికా)
ముంబై వీధుల్లో క్రికెట్ నేర్చుకుని, 2010లో ఇండియా అండర్-–19 జట్టులో చోటు సంపాదించిన యూఎస్ఏ టీమ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ కథ ఒక సినిమాను తలపిస్తుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడినా తనలో క్రికెట్‌పై మక్కువ చావలేదు. 2024 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ లాంటి మేటి జట్టును ఓడించిన అమెరికా టీమ్‌లో ఈ 34 ఏండ్ల పేసర్ కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు తన సొంత గడ్డ వాంఖడేలో అడుగుపెడుతున్నాడు. ‘నేను క్రికెట్ వదిలేసి వెళ్ళిపోయాను, కానీ క్రికెట్ నన్ను వదల్లేదు. మళ్ళీ ముంబైలో వరల్డ్ కప్ ఆడటం నా జీవితానికి లభించిన అతిపెద్ద బహుమతి’ అని సౌరభ్ ఉద్వేగంగా చెబుతున్నాడు. ఈ నెల 7న సౌరభ్ తన పాత దోస్తు సూర్యకుమార్ యాదవ్‌ను ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు ఆసక్తికరం.
బుమ్రా దోస్తు.. అమెరికా కెప్టెన్ (మోనాంక్ పటేల్)
గుజరాత్‌లోని ఆనంద్‌లో పుట్టిన మోనాంక్, ఇప్పుడు అమెరికా జట్టు లీడర్. గత ఎడిషన్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మోనాంక్ ఒకప్పుడు గుజరాత్ స్టేట్ జూనియర్ జట్టులో జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు.
బుమ్రా ఇప్పుడు వరల్డ్ టాప్ బౌలర్‌గా ఎదగగా.. మోనాంక్ అమెరికాలో స్థిరపడి ఆ టీమ్ కెప్టెన్ అయ్యాడు. ‘బుమ్రా బౌలింగ్‌ను నెట్స్‌లో ఎదుర్కోవడం అప్పుడే కష్టంగా ఉండేది. ఇప్పుడు అతను వరల్డ్ నంబర్ వన్. అతనిని ఒక ప్రత్యర్థిగా ఎదుర్కోవడం నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన విషయం’ అని మోనాంక్ అంటున్నాడు.
ఉబర్ డ్రైవర్.. ఇటలీ ప్లేయర్ (జస్‌ప్రీత్ సింగ్)
ఇటలీ జట్టులో చోటు సంపాదించిన జస్‌ప్రీత్ సింగ్ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. పంజాబ్‌లోని ఫగ్వారా నుంచి వలస వెళ్ళిన అతను ఇటలీలో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే క్రికెట్ కలను కాపాడుకున్నాడు. టేప్- చుట్టిన క్రికెట్ బాల్‌తో ప్రాక్టీస్ చేసిన అతను 2016–17లో రెడ్ బాల్ క్రికెట్ ఆడే వరకూ ఎన్నో కష్టాలు పడ్డాడు. 2019లో ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసిన జస్‌ప్రీత్ ఇటలీ లాంటి ఫుట్‌బాల్ దేశం క్రికెట్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం వెనుక ఎంతో కృషి చేశాడు.
దిల్‌ప్రీత్ బజ్వా (కెనడా కెప్టెన్)
ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక, రిజెక్షన్స్ ఎదుర్కొన్న దిల్‌ప్రీత్ బజ్వా 2020లో కెనడాకు వలస వెళ్ళాడు. ఆరేండ్ల కఠోర శ్రమ తర్వాత ఇప్పుడు అదే ఇండియా గడ్డపై కెనడా జట్టుకు కెప్టెన్‌గా తిరిగి రావడం ఒక గొప్ప విజయం. పంజాబ్ మట్టిలో పుట్టిన ఈ 23 ఏండ్ల యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
ఆర్యన్ దత్ (నెదర్లాండ్స్)
నెదర్లాండ్స్ జట్టులో ఉన్న ఏకైక భారత సంతతి ఆటగాడు ఆర్యన్ దత్. 1980ల్లోనే తన కుటుంబం నెదర్లాండ్స్ వెళ్లిపోయింది. 22 ఏండ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్‌లో తన ప్రతిభను చాటాడు.
జతీందర్ సింగ్ (ఒమన్ కెప్టెన్)
పంజాబ్ లూధియానాకు చెందిన 36 ఏండ్ల జతీందర్ సింగ్ గత దశాబ్ద కాలంగా ఒమన్ క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఒమన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఒమన్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఆ టీమ్ నాకౌట్ గ్రూప్ దశ దాటితే తప్ప తన సొంత గడ్డపై ఆడే అవకాశం అతనికి దక్కకపోవచ్చు.
