సెంచరీతో చెలరేగిన ధావన్.. ఢిల్లీ ప్లేఆఫ్ బెర్త్ ఖాయం!

సెంచరీతో చెలరేగిన ధావన్.. ఢిల్లీ ప్లేఆఫ్ బెర్త్ ఖాయం!

కాస్త లేటుగా ఫామ్‌లోకి వచ్చిన శిఖర్‌ ధవన్‌ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 నాటౌట్‌) చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. లాస్ట్‌ రెండు మ్యాచ్‌ల్లో ఫిఫ్టీలతో మెరిపించిన ఢిల్లీ ఓపెనర్‌ ఈసారి తన హండ్రెడ్‌ పర్సెంట్‌ ఇచ్చాడు. ఓ రనౌట్, రెండు క్యాచ్‌లు వదిలేసి చెన్నై ప్లేయర్లు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న గబ్బర్​ షార్జాలో సెంచరీతో దంచికొట్టాడు. లాస్ట్‌ ఓవర్లో 17 రన్స్‌ అవసరమైన టైమ్‌లో అక్షర్‌ పటేల్‌ (5 బంతుల్లో 21 నాటౌట్‌) మూడు సిక్సర్లతో అదిరిపోయే ముగింపునివ్వగా.. లీగ్‌లో ఏడో విక్టరీ సాధించిన ఢిల్లీ  ప్లేఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది..! చిన్న గ్రౌండ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన చెన్నై ఆటను ఆఖరి ఓవర్‌దాకా తీసుకొచ్చినా గమ్యాన్ని ముద్దాడలేకపోయింది..!  ఫీల్డింగ్‌ తప్పిదాలు.. లాస్ట్‌ ఓవర్‌ను స్పిన్నర్‌తో వేయించిన ధోనీ ప్లాన్‌ బెడిసికొట్టగా 9 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమి మూటగట్టుకుంది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది ధోనీసేన.

షార్జా:  ఢిల్లీ క్యాపిట్సల్‌‌ కు ఎదురేలేకుండా పోయింది. మరోసారి ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో  మెప్పించిన శ్రేయస్‌‌ అయ్యర్‌‌ సేన శనివారం రాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌లో  ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 179/4 స్కోరు చేసింది. డుప్లెసిస్‌‌ (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), అంబటి రాయుడు (25 బంతుల్లో 1 ఫోర్‌‌, 4 సిక్సర్లతో 45 నాటౌట్‌‌), జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33 నాటౌట్‌‌) సత్తాచాటారు. అనంతరం ధవన్‌‌, అక్షర్‌‌ మెరుపులతో ఢిల్లీ మరో బాల్‌‌ మిగిలుండగానే 185/5 స్కోరు చేసి గెలిచింది. ధవన్‌‌కే మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

ఆ నలుగురి తలో చేయి..

స్టార్టింగ్‌‌, మిడిల్‌‌ ఓవర్లలో తడబడినప్పటికీ.. డుప్లెసిస్‌‌–వాట్సన్‌‌, అంబటి రాయుడు–జడేజా ఇచ్చిన రెండు కీలక పార్ట్‌‌నర్‌‌షిప్స్‌‌తో చెన్నై మంచి స్కోరు చేయగలిగింది. టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నైకి ఫస్ట్ ఓవర్లోనే షాక్‌‌ తగిలింది.  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చి  మెరిపించిన యంగ్‌‌స్టర్‌‌ సామ్‌‌ కరన్‌‌ (0) ఇన్నింగ్స్‌‌ థర్డ్‌‌ బాల్‌‌కే ఔటయ్యాడు. సెకండ్‌‌ ఓవర్‌‌ను రబాడ మెయిడిన్‌‌ చేశాడు. దేశ్‌‌పాండే బౌలింగ్‌‌లో వాట్సన్‌‌ రెండు ఫోర్లతో వేగం పెంచాడు. ఫస్ట్‌‌ పది బాల్స్‌‌లో ఐదే రన్స్‌‌ చేసిన డుప్లెసిస్‌‌ ఐదో ఓవర్లో 6, 4, 4తో అన్రిచ్‌‌ నోకియాకు వెల్‌‌కమ్‌‌ చెప్పాడు. ఆపై, తుషార్‌‌ వేసిన  11వ ఓవర్లో 6,4తో క్లాస్‌‌ చూపెట్టాడు. నెక్ట్స్‌‌ ఓవర్లోనే  వాట్సన్‌‌ను బౌల్డ్‌‌ చేసిన అన్రిచ్‌‌ సెకండ్ వికెట్‌‌కు 87 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. ఇక, 39 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను మిడాన్‌‌లో ధవన్‌‌ డ్రాప్‌‌ చేశాడు. కానీ, 15వ ఓవర్లో రబాడ ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను లాఫ్ట్‌‌ చేసే ప్రయత్నంలో అతను ధవన్‌‌కే క్యాచ్‌‌ ఇచ్చాడు. అంబటి రాయుడు ఓవర్‌‌కో సిక్సర్‌‌తో ధాటిగా ఆడినా..   ధోనీ (3) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. అన్రిచ్‌‌ బౌలింగ్‌‌లో అతను కీపర్‌‌కు చిక్కాడు. దాంతో, 17 ఓవర్లకు134/4తో నిలిచిన చెన్నై 160 రన్స్‌‌ చేయడం కూడా కష్టం అనిపించింది. కానీ, చివరి మూడు ఓవర్లలో అంబటి, జడేజా అదరగొట్టారు.  సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఇద్దరూ  21 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ రన్స్‌‌ జోడించారు.  అన్రిచ్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో జడేజా రెండు సిక్సర్లతో ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చాడు. ఓవరాల్‌‌గా చివరి మూడు ఓవర్లలో 45 రన్స్‌‌ వచ్చాయి.

ధవన్‌‌ ధమాకా

చెన్నై  మాదిరిగా ఢిల్లీకి కూడా ఛేజింగ్‌‌లో మంచి ఆరంభం లభించలేదు.  అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన  పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌  (2/18) పవర్‌‌ప్లేలోనే రెండు వికెట్లు తీసి క్యాపిటల్స్‌‌ను దెబ్బకొట్టాడు. ఓపెనర్‌‌ పృథ్వీ షా (0) మరోసారి డకౌటయ్యాడు.  ఇన్నింగ్స్‌‌ సెకండ్‌‌ బాల్‌‌కే  చహర్‌‌కు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇవ్వగా ఫస్ట్‌‌ ఓవర్‌‌ మెయిడిన్‌‌ అయింది.  ఆ వెంటనే రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్న రహానె (8).. ఐదో ఓవర్లో బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌లో సామ్‌‌ కరన్‌‌ అందుకున్న చురుకైన క్యాచ్‌‌కు వెనుదిరిగాడు. రెండు బాల్స్‌‌ తర్వాత వాట్సన్‌‌ డైరెక్ట్‌‌ త్రో మిస్సవడంతో లైఫ్‌‌ దక్కించుకున్న అయ్యర్‌‌ (23).. శార్దుల్‌‌ బౌలింగ్‌‌లో లాంగాన్‌‌ మీదుగా సిక్సర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. పవర్‌‌ ప్లేలో ఢిల్లీ 41/2తో నిలిచింది. ఆ తర్వాత కూడా అదృష్టం ఢిల్లీ వెంట నడించింది. జడేజా వేసిన ఏడో ఓవర్లో ధవన్‌‌ ఇచ్చిన  చహర్‌‌ మిస్‌‌ చేశాడు. అప్పటికి అతను 25 రన్స్‌‌ వద్ద ఉన్నాడు. ఈ చాన్స్‌‌ సద్వినియోగం చేసుకున్న శిఖర్‌‌ స్వేచ్ఛగా షాట్లు కొడుతూ 29 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అతనిచ్చిన మరో క్యాచ్‌‌ను కీపర్‌‌ ధోనీ అందుకోలేకపోయాడు. సగం ఓవర్లకు ఢిల్లీ 76/2తో నిలవగా.. ధవన్‌‌, అయ్యర్‌‌ ఇద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో ఆ జట్టు ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, 12వ  ఓవర్లో అయ్యర్‌‌ను వెనక్కుపంపిన బ్రావో చెన్నైని రేసులోకి తెచ్చాడు. కానీ, స్టోయినిస్‌‌ (14 బంతుల్లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 24) వచ్చీరాగానే కర్ణ్‌‌ శర్మ బౌలింగ్‌‌లో 6, 4 బాది స్కోరు వంద దాటించాడు. ఇక, కర్ణ్‌‌ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధవన్‌‌ మరో క్యాచ్‌‌ను రాయుడు మిస్‌‌ చేశాడు. తర్వాతి బాల్‌‌ను స్టోయినిస్‌‌ సిక్సర్‌‌గా మలచగా.. వెంటనే మరో షాట్‌‌ ఆడాడు. ఈసారి మిస్టేక్‌‌ చేయని రాయుడు క్యాచ్‌‌ అందుకోవడంతో ఫోర్త్‌‌ వికెట్‌‌కు 41 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీకి 41 రన్స్‌‌ అవసరం అవగా రెండు జట్లకూ సమాన అవకాశాలు కనిపించాయి. ఏ మాత్రం వెనక్కు తగ్గని ధవన్‌‌.. కరన్‌‌ బౌలింగ్‌‌లో 4, 6.. శార్దుల్‌‌ ఓవర్లో 4 బాదడంతో సమీకరణం 12 బాల్స్‌‌లో 21గా మారింది. అయితే, 19వ ఓవర్లో అలెక్స్‌‌ క్యారీ (4)ని ఔట్‌‌ చేసిన కరన్‌‌  నాలుగే రన్సే ఇవ్వడంతో మ్యాచ్‌‌ మరింత రసవత్తరంగా మారింది. లాస్ట్‌‌ బాల్‌‌కు సింగిల్‌‌తో సెంచరీ పూర్తి చేసుకున్న ధవన్‌‌ చివరి ఓవర్లో స్ట్రయికింగ్‌‌కు రాగా.. ఆఖరి ఓవర్లో ఆ జట్టుకు  17 పరుగులు అవసరం అయ్యాయి. ధోనీ అనూహ్యంగా స్పిన్నర్‌‌ జడేజాతో బౌలింగ్‌‌ చేయించాడు. వైడ్‌‌తో ఓవర్‌‌ స్టార్ట్‌‌ చేసిన జడ్డూ ఫస్ట్‌‌ బాల్‌‌కు సింగిల్‌‌ ఇచ్చాడు.  స్ట్రయికింగ్‌‌కు వచ్చిన అక్షర్‌‌ పటేల్‌‌ పవర్‌‌ఫుల్‌‌ షాట్లతో  వరుసగా 6, 6, 2, 6 బాది ఢిల్లీని గెలిపించాడు.

సంక్షిప్త స్కోర్లు

చెన్నై: 20 ఓవర్లలో 179/4 (డుప్లెసిస్‌‌ 58, రాయుడు 45 నాటౌట్‌‌,  వాట్సన్‌‌ 36, జడేజా 33 నాటౌట్‌‌, అన్రిచ్‌‌ 2/44);

ఢిల్లీ: 19.5 ఓవర్లలో 185/5 (ధవన్‌‌ 101 నాటౌట్‌‌, స్టోయినిస్‌‌ 24, అయ్యర్‌‌ 23, అక్షర్‌‌ 21 నాటౌట్‌‌, చహర్‌‌ 2/18).