సిద్ధార్థ్‌ కుమ్మేశాడు..టైటాన్స్‌‌కు రెండో విజయం

సిద్ధార్థ్‌ కుమ్మేశాడు..టైటాన్స్‌‌కు రెండో విజయం

చెన్నై ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ (పీకేఎల్‌‌‌‌)లో టైటాన్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ రైడర్‌‌‌‌  సిద్ధార్థ్‌‌‌‌ దేశాయ్‌‌‌‌.. రైడింగ్‌‌‌‌లో కుమ్మేశాడు. హర్యానా డిఫెన్స్‌‌‌‌ను ఛేదిస్తూ 18 పాయింట్లు కొల్లగొట్టాడు. రైడింగ్‌‌‌‌కు వెళ్లిన ప్రతిసారి పాయింట్‌‌‌‌ తీసుకురావడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తెలుగు టైటాన్స్‌‌‌‌ 40–29 పాయింట్లతో హర్యానా స్టీలర్స్‌‌‌‌పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌‌‌‌లో తెలుగు టీమ్‌‌‌‌కు ఇది రెండో విజయం. సిద్ధార్థ్‌‌‌‌ సూపర్‌‌‌‌–10తో (సింగిల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్ల తీసుకురావడం) విజయంలో కీలక పాత్ర పోషించగా, సూరజ్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ 6, అబోజర్‌‌‌‌, విశాల్‌‌‌‌ చెరో మూడు పాయింట్లతో అండగా నిలిచారు. సిద్ధార్థ్‌‌‌‌ ఈ సీజన్‌‌‌‌లో రెండోసారి సూపర్‌‌‌‌–10 సాధించడం విశేషం. హర్యానా తరఫున వికాస్‌‌‌‌ (9), వినయ్‌‌‌‌ (4), ప్రశాంత్‌‌‌‌ (3) మెరుగ్గా ఆడారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్‌‌‌‌కు దేశాయ్‌‌‌‌ బ్రదర్స్‌‌‌‌ రైడింగ్‌‌‌‌తో వరుసగా పాయింట్లు అందించారు. తొలి హాఫ్‌‌‌‌ మరో ఎనిమిది నిమిషాల్లో ముగుస్తుందనగా మంచి సమన్వయంతో వికాస్‌‌‌‌ను ట్యాకిల్‌‌‌‌ చేయడంతో టైటాన్స్‌‌‌‌ 21–13 ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్‌‌‌‌లోనూ టైటాన్స్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌లో ఆకట్టుకుంది. వికాస్‌‌‌‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హర్యానాను ఆలౌట్‌‌‌‌ చేసింది. మరో మ్యాచ్‌‌‌‌లో పుణెరి పల్టన్‌‌‌‌ 31–31తో తమిళ్‌‌‌‌ తలైవాస్‌‌‌‌పై డ్రా చేసుకుంది. పల్టన్‌‌‌‌ టీమ్‌‌‌‌లో పంకజ్‌‌‌‌ (7), నితిన్‌‌‌‌ (5), సుర్జీత్‌‌‌‌ (7), మంజిత్‌‌‌‌ (5) రాణించారు. తలైవాస్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ (8), అజిత్‌‌‌‌ (8), రన్‌‌‌‌సింగ్‌‌‌‌ (4) చెలరేగిన ప్రయోజనం లేకపోయింది.