ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కావాలంటే..అడిగినంత ఇవ్వాలె

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కావాలంటే..అడిగినంత ఇవ్వాలె

మిర్యాలగూడ, వెలుగు రైతు సడన్‌‌‌‌గా మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బీమాను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫార్మర్స్ గ్రూప్ ​ఆఫ్ ​ఇన్సూరెన్స్​ స్కీం పేరుతో రూ. 5 లక్షల బీమాను అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుండగా, రైతు ఏ కారణం చేత మరణించినా బీమా వర్తించేలా చర్యలు తీసుకుంది. ఇందుకు చనిపోయిన రైతు డెత్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌తో పాటు, నామినీకి సంబంధించిన గుర్తింపు పత్రాలను అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లకు అందజేయాల్సి ఉంటుంది. వారు ఆ డాక్యుమెంట్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో సబ్మిట్‌‌‌‌ చేస్తే పది రోజుల్లోనే నామినీ అకౌంట్‌‌‌‌లో డబ్బులు జమ అవుతాయి.

చేతివాటం చూపుతున్న ఆఫీసర్లు

రైతు బీమా క్లయిమ్‌‌‌‌ చేయడంలో కొందరు మండల స్థాయి అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లు చేతివాటం చూపుతున్నారు. బీమా క్లయిమ్‌‌‌‌ చేసుకునేందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, విజిలెన్స్‌‌‌‌తో పాటు థర్డ్‌‌‌‌ పార్టీ విచారణ జరగగానే బీమా డబ్బులు వస్తాయని పై ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ మండల అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. టెక్నికల్‌‌‌‌ సమస్యలు ఉన్నాయి.. సీరియల్‌‌‌‌ ఎక్కువగా ఉంది.. త్వరగా రావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్‌‌‌‌ చేయడంతో పాటు మీ–సేవ నిర్వాహకుల ద్వారా రైతు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పది రోజుల్లోనే డబ్బులు రావాల్సి ఉండగా, 15 రోజులైనా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్‌‌‌‌లో 83 అప్లికేషన్లు

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2.24 లక్షల మంది రైతులు ఉండగా 2019 ఆగస్ట్​నుంచి ఇప్పటి వరకు 757 మంది చనిపోయారు. వీరిలో 674  మంది రైతులకు రూ. 33.70 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంకా 83 మంది రైతుల అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. వీరికి సంబంధించిన పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌ పుస్తకాలు, నామినీలకు సంబంధించిన వివరాల నమోదులో తేడా కారణంగా పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన

బీమా క్లయిమ్‌‌‌‌ చేసేందుకు అన్ని సర్టిఫికెట్లను వ్యవసాయాధికారి శ్రీనివాస్‌‌‌‌కు అందజేశాను. కాని రూ. 15 వేలు ఇస్తేనే డాక్యుమెంట్స్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేస్తామంటూ మీ–సేవకు సంబంధించిన వ్యక్తి ద్వారా ఒత్తిడి చేస్తున్నాడు. నేను ఆటోడ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నా. డబ్బులు ఇచ్చే స్థోమత లేదు. అధికారులు స్పందించి నా సమస్యను పరిష్కరించాలి.

– యాదగిరి, బాధితుడు

నా దృష్టికి రాలేదు

రైతు బీమా క్లయిమ్‌‌‌‌ విషయంలో అక్రమాలకు జరగకుండా ఆన్​లైన్​ విధానాన్ని అమలు చేస్తున్నాం. నామినీగా ఉన్న వారు డాక్యుమెంట్లను ఏఈవోకు ఇస్తే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఏవో సంతకాలు కాగానే ఫైల్‌‌‌‌ డీఏవో ఆఫీస్‌‌‌‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఎల్‌‌‌‌ఐసీ ఆఫీస్‌‌‌‌కు పంపిస్తాం. క్లయిమ్‌‌‌‌ పెండింగ్‌‌‌‌లో ఉంటే జిల్లా నోడల్​ఆఫీసర్లను కలవాలి. బీమా వర్తింపునకు డబ్బులు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. థర్డ్​ పార్టీ విచారణలో తేలితే చర్యలు తీసుకుంటాం.

– శ్రీధర్‌‌‌‌రెడ్డి,
జిల్లా వ్యవసాయాధికారి, నల్గొండ