రాజీవ్ గాంధీ వ్యక్తిత్వ వికాస కేంద్రం నిర్మాణానికి స్థలం ఇవ్వాలి

రాజీవ్ గాంధీ వ్యక్తిత్వ వికాస కేంద్రం నిర్మాణానికి స్థలం ఇవ్వాలి

కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశంలో  పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

కంటోన్మెంట్, వెలుగు: బోయిన్ పల్లిలో రాజీవ్ గాంధీ వ్యక్తిత్వ వికాస కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జరిగిన కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బోయిన్​పల్లి శివారులోని రెండెకరాల స్థలంలో టీపీసీసీ  ప్రతిపాదించిన రాజీవ్​గాంధీ అంతర్జాతీయ  వ్యక్తిత్వ వికాస కేంద్రం నిర్మాణానికి  అనుమతి విషయం ఏమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బోయిన్ పల్లి శివారులోని రక్షణ శాఖకు చెందిన పదెకరాల స్థలాన్ని భూ బదలాయింపు చేశారన్నారు. ఈ స్థలాన్ని వికాస కేంద్రం ఏర్పాటుకు కేటాయించారన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో నిర్మాణానికి అనుమతించాలంటూ కాంగ్రెస్ సీనియర్​ నేత మల్లు రవి పేరుతో వచ్చిన దరఖాస్తుపై  చర్చ జరిపారు.

మరోవైపు ఈ స్థలంలో  భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దంటూ బీజేపీకి చెందిన కంటోన్మెంట్ సివిల్ నామినేటెడ్​ సభ్యుడు రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే సాయన్న పట్టుబట్టారు. ఇప్పటి వరకు కంటోన్మెంట్​లో ఇతరులకు ఇస్తున్నట్లుగానే నిర్మాణానికి అనుమతించాలంటూ  రేవంత్​రెడ్డి  కోరారు. సమావేశంలో పలు సమస్యలను  రేవంత్​రెడ్డి బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. అమ్ముగూడతో పాటు పలు ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక  డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, పలు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి బోర్డు నిధులు మంజూరు చేయాలన్నారు.  ఈ విషయమై   కలెక్టర్​కు లెటర్ రాస్తామని, 30 రోజుల్లో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారులు సోమశంకర్​, సీఈవో అజిత్​రెడ్డి  ప్రకటించారు.