తినేటోళ్లకే గుడ్డు పెట్టండి: చత్తీస్ గఢ్ ప్రభుత్వం

తినేటోళ్లకే గుడ్డు పెట్టండి: చత్తీస్ గఢ్ ప్రభుత్వం
  • వెజిటేరియన్ పిల్లలకు స్పెషల్ మెనూ   
  • మిడ్ డే మీల్స్ పై చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆదేశం

రాయ్ పూర్: ప్రభుత్వ స్కూళ్లలో అందిస్తున్న మిడ్ డే మీల్స్ లో కోడిగుడ్డును.. తినే పిల్లలకు మాత్రమే వడ్డించాలని, తినని వాళ్లకు ప్రత్యేకంగా వెజిటేరియన్ ఫుడ్ అందించాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆదేశించింది. గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు వడ్డించాలన్న ప్రతిపాదనపై  వ్యతిరేకత రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు బలమైన  ఆహారం అందించాలన్న ఉద్దేశంతో.. గుడ్లు, పాలు లేదా పోషకాలు కలిగిన మరేదైనా భోజనం వారానికి రెండుసార్లు మధ్యాహ్న భోజనంలో చేర్చాలని ఈ ఏడాది జనవరిలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ సూచించింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తో పాటు కొన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కబీర్ దాస్ వర్గీయులు తమ పిల్లలకు గుడ్డు వద్దంటూ కిందటివారం కబీర్ దామ్ జిల్లాలో నిరసనలు చేపట్టారు. తమ పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారని, గుడ్లు తినడం తమ సాంప్రదాయానికి విరుద్ధమని, భోజన మెనూ నుంచి గుడ్లను తొలగించాలంటూ కబీర్ పంథ్ శాఖ సభ్యులు ఆందోళనలకు దిగారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో .. ఆ వర్గాలను ఒప్పించేందుకు ప్రభుత్వం చేయాల్సినన్ని ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకపోయేసరికి తాజా నిర్ణయం తీసుకోక తప్పలేదు.

గుడ్లకు బదులుగా సోయా పాలు, బిస్కెట్లు

రాష్ట్రంలో అందరి మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అపోజిషన్ పార్టీలు బీజేపీ, జనతా కాంగ్రెస్ చత్తీస్ గఢ్ (జె) సోమవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు.. గిరిజనులు, వెనుకబడిన ప్రాంతాల పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు గుడ్లు వడ్డించాలని సూచించారు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ మధ్యాహ్న భోజనంలో వెజిటేరియన్ పిల్లల్ని గుర్తించి వారికి ప్రత్యేక మెనూ ఎర్పాటు చేసేందుకు పలు సూచనలు చేసింది. మిడ్ డే మీల్స్ లో గుడ్లు తినని వారు, తినే వారెవరో గుర్తించేందుకు స్కూల్ డెవలప్ మెంట్ కమిటీలు, పిల్లల పేరెంట్స్ తో సమావేశం ఏర్పాటు చేసి, వారంలోగా రిపోర్టులు పంపించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను బుధవారం ఆదేశించింది. వడ్డించడంలో ఎలాంటి అభ్యంతరం లేనివాళ్లకు గుడ్లు విడిగా ఉడికించి పెట్టాలని సూచించింది. వెజిటేరియన్లకు సోయా పాలు, ప్రొటీన్ క్రంచ్, బిస్కెట్లు లేదా తృణ ధాన్యాలు(పల్సెస్), పప్పులు మెనూలో చేర్చాలని, ప్రత్యేక సిట్టింగ్ అరేంజ్ చేయాలని ఆదేశించింది.

చికెన్, గుడ్డును వెజ్ గా ప్రకటించాలి: సంజయ్ రౌత్

చికెన్, గుడ్లు వంటి ఫౌల్ట్రీ ఉత్పత్తులను శాకాహారంగా వర్గీకరించాలంటూ శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌‌ బుధవారం రాజ్యసభ లో డిమాండ్ చేశారు. ఆయుర్వేదంతో కలిగే ప్రయోజనాలపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చికెన్ శాకా హారమో.. మాంసాహారమో ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చాలని కోరారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని సభలో వివరించారు. ఓ సందర్భంలో తాను నందుర్బార్ రీజియన్ లో మారుమూల ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ఆదివాసీలు తనకు భోజనం వడ్డించారని.. ఇదేంటి అని అడిగితే  ‘ఆయుర్వేదిక్ చికెన్’ అని చెప్పారన్నారు. దాన్ని తింటే అనారోగ్య సమస్యలు ఉండవని ఆదివాసీలు తనతో చెప్పినట్లు తెలిపారు.