విజయంతో వీడ్కోలు పలికేనా!

విజయంతో వీడ్కోలు పలికేనా!

కొలంబో: శ్రీలంక వెటరన్‌‌ పేసర్‌‌ లసిత్‌‌ మలింగ వన్డే క్రికెట్‌‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా బంగ్లాదేశ్‌‌–శ్రీలంక మధ్య శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగే తొలి వన్డే మలింగ కెరీర్‌‌లో ఆఖరి యాభై ఓవర్ల మ్యాచ్‌‌. ఇందులో గెలిచి మలింగకు విజయంతో వీడ్కోలు పలకాన్ని లంక ఆశిస్తోంది. అదే సమయంలో లెజెండరీ బౌలర్‌‌ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. వరల్డ్‌‌కప్‌‌ పరాభవం తర్వాత మలింగ ప్లేస్‌‌లో సరైన ఆటగాడిని వెతకడం తమ ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటని లంక కెప్టెన్‌‌ దిముత్‌‌ కరుణరత్నె తెలిపాడు. 35 ఏళ్ల మలింగ ఇప్పటివరకు 225 వన్డేలు ఆడి 335 వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌‌గా ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్‌‌ (523), చమిందా వాస్‌‌ (399) అతని ముందున్నారు. తన లాస్ట్‌‌ వన్డేలో మూడు వికెట్ల పడగొడితే.. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌‌గా అనిల్‌‌ కుంబ్లే (337)ను అధిగమిస్తాడు.