ఇంకా తెలియని 33 మంది ఆచూకీ

ఇంకా తెలియని 33 మంది ఆచూకీ
  • బోటు ప్రమాదంలో మరో నలుగురి మృతదేహాలు గుర్తింపు
  • కొనసాగుతున్న గాలింపు
  • 351 అడుగుల లోతులో బోటు
  • బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్
  • నదీలో, తీర ప్రాంతంలో హెలికాప్టర్లు, బోట్లతో వెతుకులాట
  • హైదరాబాద్​ నుంచి వెళ్లిన వారిలోనూ 13 మంది జాడ లేదు

అమరావతి, వెలుగు:

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో సోమవారం నలుగురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 33 మంది ఆచూకీ తెలియరాలేదు. వారికోసం నేవీ, విపత్తు నిర్వహణ బృందాలు చేపట్టిన గాలింపు కొనసాగుతూనే ఉంది. దాంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమవారు తిరిగి వస్తారో, లేదోనంటూ కన్నీళ్లు పెడుతున్నారు. వరంగల్‍ అర్బన్‍ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు మరణించినట్టు ఇప్పటికే గుర్తించగా.. మరో ఏడుగురి జాడ తెలియడం లేదు. హైదరాబాద్​ నుంచి వెళ్లినవారిలోనూ ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. ఇంకా 13 మంది ఆచూకీ తెలియలేదు. ఇప్పటివరకు మొత్తంగా 12 మృతదేహాలను గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు అధికారులు ప్రకటించారు. బోటులో ప్రయాణించినవారిలో 27 మంది సురక్షితంగా ఉన్నారని, మిగతావారి ఆచూకీ లభించలేదని తెలిపారు. గోదావరి నదిలో ప్రమాదం జరిగిన చోట 351 అడుగుల లోతులో రాయల్ వశిష్ట బోటు ఉందని నేవీ అధికారులు గుర్తించారు. దానిని వెలికి తీయడం కోసం విశాఖ నేవీ బేస్ క్యాంప్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. మెరైన్ డైవర్లు, ఉత్తరాఖండ్ సైడ్ సోనార్ స్కాన్ సిస్టమ్ సహాయంతో బోటును వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్లంతైనవారిలో చాలా వరకు బోటులోని రూమ్​లలో ఉండొచ్చని, దానిని వెలికితీస్తే మృతదేహాలు లభించే అవకాశముందని సహాయక సిబ్బంది చెప్తున్నారు. ఇక గల్లంతైనవారి కోసం రెండు నేవీ, ఒక ఓఎన్జీసీ హెలికాప్టర్లతోపాటు బోట్లు, పడవల ద్వారా గాలిస్తున్నారు.

సహాయక చర్యల్ని పర్యవేక్షించిన జగన్

బోటు ప్రమాద ప్రాంతంలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. నదిలో ప్రమాద ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించి, రాజమండ్రి హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. తర్వాత రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రమాదంపై సమీక్షించారు. కాగా.. బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల వారందరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అన్న తేడా లేకుండా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గాయపడినవారికి రూ.3 లక్షలు

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జగన్​ ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.3 లక్షల చొప్పున, ప్రమాదంలో నుంచి బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. బాధితుల ఆవేదన, బాధ చెప్పతరం కాదని, వీలైనంత త్వరగా గాలింపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రమాదంపై విచారణ కోసం అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, పువ్వాడ అజయ్ కూడా పాల్గొన్నారు. వారితో జగన్​ మాట్లాడారు. తెలంగాణకు చెందిన వారి మృతదేహాల తరలింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

351 అడుగుల లోతులో బోటు

గోదావరిలో ఆదివారం మునిగిన బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్టు నేవీ, ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్ అధికారులు గుర్తించారు. లోతు చాలా ఎక్కువగా ఉండటం, గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బోటును వెలికితీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని వారు తెలిపారు. గల్లంతైన వారిలో చాలామంది లాంచీలోని ఏసీ గదుల్లో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌, ఓఎన్‌‌‌‌జీసీ హెలిక్యాప్టర్లు ఏరియల్ సర్వే ద్వారా ప్రయత్నిస్తుండగా.. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, గజ ఈతగాళ్లు పడవల ద్వారా గాలిస్తున్నారు.

బోటు యజమానిపై కేసు నమోదు

గోదావరి నదిలో అనుమతులు లేకున్నా టూరిస్ట్ బోటు నడిపినందుకు రాయల్ వశిష్ట బోటు యజమానిపై కోడిగుడ్ల వెంకటరమణపై దేవీపట్నం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో కేసు నమోదైంది. నిబంధనలు పాటించకుండా బోటు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడంటూ దేవీపట్నం తహసీల్దార్‌‌‌‌ మహబూబ్‌‌‌‌ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బోటు కెపాసిటీ ప్రకారం 60 మంది మాత్రమే ఉండాలని, కానీ బోటులో సిబ్బంది సహా 70 మందికిపైగా ఉన్నారని ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. గోదావరిలో బోటు తనిఖీ జరిగే దేవీపట్నం పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చేరుకోగానే పర్యాటకులంతా లైఫ్‌‌‌‌ జాకెట్లు వేసుకున్నారని, స్టేషన్ దాటాక వాటిని తీసేశారని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెప్పారని.. అలా లైఫ్​ జాకెట్లు తీయవద్దని హెచ్చరించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

పసికందు మృతదేహం లభ్యం

సోమవారం గాలింపు చర్యల్లో నాలుగు మృతదేహాలను గుర్తించారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరింది. మొత్తంగా 27 మంది సురక్షితంగా ఉండగా.. ఇంకో 33 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. దేవీపట్నం మండలం వాడపల్లి దగ్గర నదిలో కొట్టుకువచ్చిన ఒక పసికందు మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. రెండు రోజులు నీళ్లలో ఉండటంతో ఉబ్బిపోయిన చిన్నారి మృతదేహాన్ని చూసి సిబ్బంది, స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Still 33 missing after tourist boat accident in AP