కుక్కకి ఆర్మీ కమాండర్ సెల్యూట్: ఫొటో వెనుక అసలు స్టోరీ ఇదీ!

కుక్కకి ఆర్మీ కమాండర్ సెల్యూట్: ఫొటో వెనుక అసలు స్టోరీ ఇదీ!

శ్రీనగర్: కుక్క, ఆర్మీ కమాండర్ ఒకరికొకరు సెల్యూట్ చేస్తున్న ఫొటో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసినోళ్లందరికీ వచ్చే కామన్ డౌట్.. ఆర్మీ ఆఫీసర్ ఎందుకు ఆ కుక్కకి సెల్యూట్ చేస్తున్నారా అని! ఈ ఫొటో సోషల్ మీడియాలో ఆర్మీ ఆఫీసర్ల వరకూ చేరడంతో నేరుగా వారే దీని వెనుక స్టోరీని బయటపెట్టారు.
అమర్నాథ్ యాత్రలో…
ఈ ఫొటో కనిపిస్తున్న ఆపీసర్ కశ్మీర్లోని చినార్ కాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లోన్. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ప్రారంభంలో జూలై 1వ తేదీన తోటి జవాన్లు తీసిన ఫొటో ఇది. కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లోన్ అమరనాథుడి దర్శనం కోసం వెళ్తుండగా మంచు శివలింగానికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపులో ఆయన ఈ కుక్కకి సెల్యూట్ చేశారు.
సామాన్యమైన శునకం కాదు!
ఆర్మీ కమాండర్ నుంచి సెల్యూట్ స్వీకరిస్తున్న ఆ శునకం ఏమీ సామాన్యమైనది కాదు. ఆర్మీ రిమౌంట్ వెటర్నరీ కాప్స్ ‘సోల్జర్’. దీనిపేరు మేనక. సరిహద్దుల్లో, పలు రెస్కూ ఆపరేషన్లలో అనేకసార్లు ఉగ్రవాదులు ఉన్న ఆనవాళ్లను, పేలుడు పదార్థాలను గుర్తించింది. ఈ విషయాన్ని కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లోన్ ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసి స్వయంగా తెలిపారు. ‘అనేక సందర్భాల్లో ఎన్నో ప్రాణాలను కాపాడిన బుడ్డీకి నా సెల్యూట్’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు.
ఆర్మీ సంప్రదాయం
రిమౌంట్ వెటర్నరీ కాప్స్ లో ఉన్న శునకాలు, గుర్రాలను కూడా సైనికులతో సమానంగా చూస్తుంది మన ఆర్మీ. అవి సెల్యూట్ చేసినప్పుడు తిరిగి ఆర్మీ జవాన్లు సెల్యూట్ చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు.