నిజాయితీ (కథ)

నిజాయితీ (కథ)

ఒక రాజ్యంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను రోజూ పని వెతుక్కోవాల్సి వచ్చేది. అలా ఒకరోజు రామయ్య పని వెతుక్కోవడానికి వెళ్తుంటే రోడ్డు మీద ఒకతను ఎదురయ్యాడు. అతని చేతిలో ఉన్న నగల మూటను రామయ్యకిచ్చి ‘‘రామయ్యా నీ  పేదరికం నాకు తెలుసు. అందుకే ఈ నగల మూటను నీకు ఇద్దామని వచ్చా. దీన్ని తీసుకొని హాయిగా బతుకు” అన్నాడు. 

అందుకు రామయ్య ‘‘చూడండీ.. మీరెవరో నాకు తెలియదు. తేరగా వచ్చిన సొమ్మును నేను తీసుకోను. నేను కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రమే నాది అనుకుంటాను. అదే నాకు తృప్తి.  కావాలంటే మీరు ఈ సొమ్మును ఏ అనాథాశ్రమానికో లేదా ధర్మసత్రానికో దానం చేయండి. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి’’ అని అన్నాడు. ఆ మాటలకు ఆ వ్యక్తి రామయ్యను తిట్టుకుంటూ ముందుకు సాగిపోయాడు.

ఇంకోరోజు మరలా రామయ్య పని కోసం వెళ్తుండగా ఆ వీధిలో ఒక డబ్బుల సంచి కనపడింది. దాన్ని తీసుకుని అది ఎవరిదోనని చుట్టూ చూశాడు. కానీ, కనుచూపుమేరలో ఎవరూ కనపడలేదు. ‘‘పాపం ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు. వాళ్లే వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్తారులే. మనకెందుకు?”అనుకుని ఆ సంచిని అక్కడే పడేసి వెళ్లిపోబోయాడు. ఇంతలో వెనక నుండి  రాజభటులు ఆ సంచిని తీసుకొచ్చి రామయ్యని పట్టుకొని ‘‘నువ్వు ఈ సంచిని ఎక్కడ దొంగతనం చేశావు?’’ అని అడిగారు. రామయ్య ఏడుస్తూ ‘‘అయ్యో! నేను దొంగను కాదు. నేను సంచిని పట్టుకున్న మాట మాత్రం నిజమే. అది ఎవరిదో వాళ్లకి ఇవ్వడానికి చిరునామా​ దొరుకుతుందని చూశాను తప్ప.. దొంగిలించే ఉద్దేశం నాకు లేదు. అలా చేసేవాడినే అయితే దాన్ని నా వెంట పట్టుకుని వచ్చేవాడిని కదా!’’ అన్నాడు. 

రాజభటులు ఆ మాటలు వినకుండా రామయ్యను బంధించి రాజుగారి దగ్గరకి తీసుకెళ్లారు. రాజు కోపంగా ‘‘ఈ మూట  ఎక్కడ దొంగతనం చేశావో నిజం చెప్పు. లేకపోతే శిక్ష పడుతుంది’’ అని గద్దించాడు.

ఆ మాటలు విని రామయ్య ఏడుస్తూ ‘‘మహారాజా! నేను దొంగను కాదు. ఆ సంచిని దొంగిలించలేదు. నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి.. కావాలంటే ఈ ఊళ్లో నా గురించి ఎవరినైనా మీరు అడగండి” అని చెప్పాడు. 

ఇంతలో మహామంత్రి, రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే రాజు నవ్వి ‘‘మంత్రీ! మీరు మాట్లాడండి’’ అని అన్నాడు. అప్పుడు మంత్రి ‘‘ఓ రామయ్యా! మా కోశాగారంలో పనిచేయడానికి నిజాయితీ గల ఒక పనివాడి అవసరం ఉంది. అందుకని మేమే నీకు ఈ పరీక్షలు పెట్టాం. నిన్ను మా భటులు రహస్యంగా గమనిస్తూనే  ఉన్నారు. మొదట నీకు నగల సంచిని ఇచ్చింది కూడా మా మనిషే. అతడు తిరిగి వచ్చి నీ నిజాయితీ గురించి మాకు చెప్పాడు. అయినా మరోసారి పరీక్ష చేద్దామని నడివీధిలో డబ్బుల సంచిని వేసి మా రాజభటులను పంపించాం. వాళ్లు నిన్ను రహస్యంగా గమనించారు. నువ్వు నిజాయితీపరుడివే అని మాకిప్పుడు అర్థమైంది’’ అన్నాడు. వెంటనే రాజుగారు ‘‘ఎందుకు రామయ్యా ఏడుస్తున్నావ్​? నీలాంటి వాళ్ల అవసరం మాకు ఉంది. అందుకే నీకు మా కోశాగారంలో కొలువు ఇస్తున్నా” అనేసరికి రామయ్య కన్నీళ్లు... ఆనంద బాష్పాలుగా మారాయి.

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య