భూమిని కాపాడుకుందాం: ప్రపంచ వ్యాప్తంగా స్టూడెంట్స్ ర్యాలీ

 భూమిని కాపాడుకుందాం: ప్రపంచ వ్యాప్తంగా స్టూడెంట్స్ ర్యాలీ

వాతావరణ మార్పుల సమస్యపై స్టూడెంట్లు కదం తొక్కారు. సిడ్నీ నుంచి సియోల్​దాకా, మనీలా నుంచి ముంబై దాకా, లండన్​నుంచి న్యూయార్క్​వరకు, పెర్త్ నుంచి ప్యారిస్​వరకు.. ప్రతిచోట పుస్తకాలు పక్కనపెట్టి.. ర్యాలీలు చేశారు. ‘పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ నినదించారు. పర్యావరణ విపత్తులను అడ్డుకునేందుకు పెద్దలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్​లో యూఎన్ సమ్మిట్​జరగడానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ర్యాలీలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.

గ్లోబల్ ​క్లైమేట్ స్ట్రైక్

క్లైమేట్​చేంజ్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు నిరసనలకు పిలుపునిచ్చారు. ఆసియా, పసిఫిక్​వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్లు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆస్ర్టేలియాలో సిడ్నీ, కాన్​బెర్రాలో ‘గ్లోబల్ ​క్లైమేట్ స్ట్రైక్’ను నిర్వహించారు. గ్లోబల్​వార్మింగ్​ను నిలువరించేందుకు పొలిటీషియన్లు, వ్యాపారులు గట్టి చర్యలు తీసుకోవాలని స్టూడెంట్లు డిమాండ్ చేశారు. థాయిల్యాండ్​లో వేలాది మంది మార్చ్ ​నిర్వహించారు. ‘డై-ఇన్’ పేరుతో నేచురల్‌‌ రిసోర్సెస్ మినిస్ట్రీ బయట నాటకం ప్రదర్శించారు. ఫిలిప్పీన్స్​లో వేలాది మంది స్టూడెంట్లు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేశారు. కొన్ని నెలలుగా ‘ప్రజాస్వామ్య’ ఆందోళనలు కొనసాగుతున్న హాంకాంగ్​లో కూడా ర్యాలీలు జరిగాయి. ‘స్టాప్​పొల్యూషన్’ అంటూ నినాదాలు చేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా 5 వేల ఈవెంట్లు జరపనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. అమెరికాలో 800 ఈవెంట్లు, జర్మనీలో 400 ఈవెంట్లు నిర్వహించాలని ఆర్గనైజర్లు ప్లాన్ చేశారు.

ఢిల్లీలోనూ స్టూడెంట్ల ర్యాలీ

ప్రపంచంలో అత్యంత గాలి కాలుష్యం ఉన్న సిటీల్లో ఒకటైన ఢిల్లీలో వందలాది మంది స్టూడెంట్లు ర్యాలీలో పాల్గొన్నారు. ‘వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలి’, ‘నేను స్వచ్ఛ గాలిని పీల్చుకోవాలి’ అంటూ హౌసింగ్, అర్బన్ అఫైర్స్​మినిస్ట్రీ బయట నినాదాలు చేశారు. ‘మనకు భూమి–బి లేదు’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ముంబైలో కూడా స్కూలు పిల్లలు ర్యాలీల్లో పాల్గొన్నారు.