ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనం ప్రారంభించిన ప్రధాని మోదీ

 ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనం ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్ ను (సూరత్ డైమండ్ బోర్స్) ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (డిసెంబర్ 17న)ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్‌ షో నిర్వహించారు. సూరత్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. 

సూరత్‌లో రూ.34 వేల  కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది.  డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌ కనెక్టడ్ భవనం. దాదాపు 4 వేల 500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం మరో విశేషం.

సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65 వేల మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్‌ వేదికగా మారనుంది. 

 1.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ఉన్న పెంటగాన్‌ను ఇప్పుడు సూరత్ డైమండ్ బర్స్ అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

2023, ఆగస్టులో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది.

ప్రతి ఏటా ప్రస్తుతం రూ. 2 లక్షల కోట్ల విలువైన వజ్రాల వ్యాపారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వచ్చాక ఏటా రూ. 4 లక్షల కోట్లకు బిజినెస్ పెరుగుతుందని అంచనా.