సూర్యాపేట, వెలుగు: ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతతో పాటు వారి డిజిటల్ భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యమిస్తోందని సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ తెలిపారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో ప్రజలు పోగొట్టుకున్న రూ. 20 లక్షల విలువైన 102 సెల్ ఫోన్లను ఐటీ కోర్, సైబర్ టీమ్ సహాయంతో రికవరీ చేసి, సోమవారం జిల్లా పోలీస్ ఆఫీస్‌లో బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏడాదిగా జిల్లాలో 1,846 ఫోన్లు రికవరీ చేశామని, వీటి విలువ సుమారు రూ. 4.80కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకుని పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సీఐ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, సైబర్ వారియర్స్ టీం, బాధితులు పాల్గొన్నారు.
