మాకు గాడ్‌ ఫాదర్ లేరు.. మీరే న్యాయం చేయండి: మోడీకి సుశాంత్ సోదరి లేఖ

మాకు గాడ్‌ ఫాదర్ లేరు.. మీరే న్యాయం చేయండి: మోడీకి సుశాంత్ సోదరి లేఖ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన విచారణలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని కోరారు అతని సోదరి శ్వేత సింగ్ కీర్తి. కేసును మీరు పరిశీలించాలని కోరుతున్నానంటూ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.  లేఖకు సంబంధించి ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

మేము ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చామంటూ లేఖ ద్వారా తెలిపిన శ్వేత సింగ్ …బాలీవుడ్ లో అడుగుపెట్టే సమయంలో నా సోదరుడికి ఏ గాడ్ ఫాదర్ లేరన్నారు. ఇప్పుడు కూడా మాకు ఎవరూ లేరు. మీరు వెంటనే ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. విచారణ నిష్పక్షపాతంగా కొనసాగేలా చూడాలని విన్నవిస్తున్నాం. సాక్ష్యాలు నాశనం కాకుండా చూడాలని ప్రాధేయపడుతున్నాం. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ  మోడీకి విన్నవించారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబై సబర్బన్ బాంద్రాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను ముంబై పోలీసులు ఇంత వరకు ఛేదించలేకపోయారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.