అంబానీలకు ఐటీ నోటీసులు

అంబానీలకు ఐటీ నోటీసులు

ముంబై : మనదేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆయన భార్య నీతా, వారి ముగ్గురు సంతానానికి కూడా ఐటీ ఈ నోటీసులను జారీ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. 2015 బ్లాక్‌‌మనీ యాక్ట్ కింద ఈ ఏడాది మార్చి 28న ఈ నోటీసులను జారీ చేసినట్టు ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ పేర్కొంది. ఈ రిపోర్ట్‌‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ కొట్టిపారేస్తోంది. ఐటీ డిపార్ట్‌‌మెంట్ నుంచి ఎలాంటి నోటీసులూ అందలేదని పేర్కొంటోంది.  ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, 2011లో ఐటీ ఎంక్వైరీ ప్రారంభమైంది. జెనీవాలోని హెచ్‌‌ఎస్‌‌బీసీ బ్యాంక్‌‌లో అకౌంట్లున్న 700 మంది ఇండియన్ వ్యక్తులపై, సంస్థలపై ఐటీ విచారణ చేపట్టింది. 2015 ఫిబ్రవరిలో అంటే స్విస్ లీక్స్ అనంతరం ఈ సంఖ్య 1,195 వరకు చేరింది. జెనీవాలోని హెచ్‌‌ఎస్‌‌బీసీ బ్యాంక్‌‌లో సుమారు 14 అకౌంట్ల బ్యాలెన్సే రూ.4,200 కోట్లుగా ఉన్నట్టు తేలింది. డబ్బును మళ్లించడానికి కొన్ని  అంతర్జాతీయ కంపెనీలను వాడుకున్నారు. ఈ అకౌంట్లకు రిలయన్స్ గ్రూప్‌‌తో సంబంధం ఉన్నట్టు తేలినట్టు పేర్కొంది. ఈ విషయమై 2019 మార్చి 28న ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.  క్యాపిటల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్, థామ్స్ గ్లోబల్ లిమిటెడ్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్, అంటాలిస్ మేనేజ్‌‌మెంట్ లిమిటెడ్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్, హరినారాయణ్ ఎంటర్‌‌‌‌ప్రైజస్ కంపెనీల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

బయటికి రాని వివరాలు…

ఐటీ నోటీసుల ప్రకారం రిలయన్స్‌‌… క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్‌‌ను 2003 నవంబర్‌‌‌‌లో ఏర్పాటు చేసింది. దీని మొత్తం ఫండింగ్ వెయ్యి డాలర్లు. క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్‌‌లో అంబానీ ఫ్యామిలీ తమ హోల్డింగ్స్‌‌ను రివీల్ చేయలేదని పన్ను అథారిటీలు చెబుతున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్‌‌ కిందనున్న ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్‌‌ వివరాలను కూడా వెల్లడించలేదని తెలిపాయి. ఈ కంపెనీ నుంచి పూర్తి ప్రయోజనాలు అంబానీ ఫ్యామిలీకే వస్తున్నాయని ఆరోపించాయి. ముంబైకి చెందిన హరినారాయణ్ ఎంటర్‌‌‌‌ప్రైజస్ నుంచి ప్రయోజనాలు కూడా వారికే అందుతున్నాయని ఐటీశాఖ వర్గాలు వివరించాయి.