తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ నాయకత్వమే కొరతగా ఉంది: చంద్రబాబు

తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ నాయకత్వమే కొరతగా ఉంది: చంద్రబాబు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘‘తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ బలంగా ఉంది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకునే నాయకత్వమే కొరతగా ఉంది” అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రం ఉండగా తెలుగు గడ్డపై ఒకేఒక బలమైన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014లో తెలంగాణలో 15 సీట్లు, 22శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ టీడీపీ. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉందనే ప్రశ్న కు.. ఖమ్మం సభ తర్వాత  సరైన జవాబు దొరికింది" అని కామెంట్​ చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.‘‘తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం తెలుగుదేశం చిర స్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటుంది. టీడీపీ మనుగడ తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక అవసరం”అని  పేర్కొన్నారు. “ఎక్కడుంది తెలుగుదేశం అనేవాళ్లు.. ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుంది..  తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది తెలుగుదేశం. హైదరాబాద్‌‌‌‌ నడిగడ్డపై పార్టీ ఆవిర్భవించింది.టీడీపీకి పునాది వేసింది ఇక్కడే, అందుకు కారకులు, ప్రేరకులు ఇక్కడి ప్రజలే" అని అన్నారు. ‘‘తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచిందే టీడీపీ. జొన్నలు, సజ్జలు, రాగులు  తింటూ బతుకుతున్న  ప్రజలకు బియ్యాన్ని పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌‌‌‌దే. రూ.2కు కిలో బియ్యంతో ఎంతోమంది పేదల కడుపు నింపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆహార భద్రత పథకానికి ఆనాడే ఎన్టీఆర్​ నాంది పలికారు” అని చెప్పారు. ‘‘ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక విమర్శలు అనవసరం. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం మీద తెలుగువారే ముందుంటారు. తెలుగువారి భాగస్వామ్యంతోనే దేశం ముందుంది” అని తెలిపారు. 

ఐటీ జాబ్స్​ ఏ పార్టీ వల్ల వచ్చాయో.. గూగుల్ లో చెక్ చేసుకోండి

‘‘20 ఏళ్ల క్రితం మనం వేసిన పునాదులపైనే తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది. నాటి జీనోమ్‌‌‌‌ వ్యాలీ నేడు కరోనా వ్యాక్సిన్ తయారీకి వేదికైంది. 2030 నాటికి అది రూ.20లక్షల కోట్ల టర్నోవర్ కు చేరుతుందంటే అదీ మనం వేసిన పునాదే. ఐటీ ఎగుమతులు ఏటా రూ 2లక్షల కోట్లు ఉన్నాయంటే అదంతా టీడీపీ తెచ్చిన ప్రగతి ఫలితాలే”అని చంద్రబాబు తెలిపారు.   హైదరాబాద్ నగర శివారు జిల్లాల్లో భూములు కోట్ల విలువతో బంగారమయ్యాయంటే అవన్నీ టీడీపీ చలువేనన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పరుగులు తీస్తోందని అన్నారు. కలిసికట్టుగా పనిచేసి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ నేతలను ఆదేశించారు. ‘‘ మీకు ఐటీ ఉద్యోగం రావడానికి ఏ పార్టీ కారణమో గూగుల్ లోకెళ్లి చెక్ చేసుకోండి, పార్టీకి అండగా ఉండాల్సిన బాధ్యత యువతదే.. మీ భవిష్యత్తుకు దిక్సూచి అయిన పార్టీకి రుణం తీర్చుకునే సమయం వచ్చింది” అని అన్నారు.  ‘‘నాయీ బ్రాహ్మణులకు తొలి సీటని కాసాని మొన్న చెప్పారు.. రెండో సీటు ఇప్పుడు ప్రకటిస్తున్నాం. అది రజకులకే.. ఇన్నాళ్లు అధికారం దక్కని వర్గాలకు అధికారం హస్తగతం చేయడమే తెలుగుదేశం ప్రధాన లక్ష్యం”అని చెప్పారు. ఎన్టీఆర్ కు భారత రత్న  ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 29న సికింద్రాబాద్‌‌‌‌ పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో ‘సింహగర్జన’ పేరుతో నిర్వహిస్తామన్నారు. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అయితే..  అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాగా, ఇటీవల మృతి చెందిన నందమూరి తారకరత్నకు నివాళులర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటించారు.  

టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించండి 

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలి. దీనికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ పెడ్తాం. ఎప్పటికప్పుడు పనితీరును పార్టీ పెద్దలంతా పర్యవేక్షిస్తారు.  ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నాయకులను ఆహ్వానించాలి.

 - టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్