- ఆత్మకూరు(ఎం), మోత్కూరు మెయిన్ రోడ్డు పనుల పరిశీలన
ఆత్మకూరు(ఎం), మోత్కూరు, (యాదాద్రి), వెలుగు: నిలిపేసిన రోడ్డు పనులను మూడు రోజుల్లో తిరిగి ప్రారంభించకుంటే టెండర్లు రద్దు చేసి కొత్త ఏజెన్సీలకు పనులు అప్పజెబుతానని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంట్రాక్టర్లను హెచ్చరించారు.
యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) నుంచి మోత్కూరు వెళ్లే మెయిన్ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. నిలిచిపోయిన రోడ్డు పనులతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వెంటనే సంబంధిత కాంట్రాక్టర్కు ఫోన్ చేసి పనులు ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
యాదగిరిగుట్ట-తుర్కపల్లి రోడ్డులోనూ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని చెప్పారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేసి, ఇతర ఏజెన్సీలకు అప్పగించి రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్అండ్బీ ఆఫీసర్ సరిత ఉన్నారు.
ఒక్కరి పేరు కూడా మిస్ కావద్దు
సర్ ప్రక్రియ కారణంగా అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా మిస్ కావద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆత్మకూరు(ఎం)లో నిర్వహించిన ఆలేరు నియోజవర్గ స్థాయి సర్ రివ్యూలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన మాట్లాడారు.
ప్రతి ఒక్క ఓటరును కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. సర్ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన్న పలువురు బీఎల్వోలకు మంత్రి నగదు ప్రోత్సాహకం అందించారు.
