మొబైల్ షాప్ కూల్చివేతతో ఉద్రిక్తత

మొబైల్ షాప్ కూల్చివేతతో ఉద్రిక్తత
  • జగదీశ్ ​మార్కెట్ లో ఘటన 
  • ఆందోళనకు దిగిన వ్యాపారులు
  • అబిడ్స్ పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: మొబైల్ షాప్ కూల్చివేత  ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడికి మద్దతుగా వ్యాపారులు ఆందోళనకు దిగి నిరసన తెలిపిన ఘటన అబిడ్స్ జగదీశ్​మార్కెట్ లో శుక్రవారం చోటుచేసుకుంది.  15 ఏళ్లుగా సంజయ్ మొబైల్ షాప్ పేరుతో సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నాడు. శాంతాబాయి నర్సింగ్ హోమ్ కు చెందిన స్థలంలో అతని షాపు ఉంది. ఇటీవల ఓనర్లు ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు అమ్మారు. ఆ స్థలంలోని షాప్ ను తీసివేయాలంటూ కొద్దీరోజులుగా సంజయ్ పై స్థల  కొనుగోలుదారులు ఒత్తిడి తెస్తుండగా కొంత సమయం కావాలని అడిగాడు. 

వారు ఒప్పుకోకపోగా బెదిరింపులకు దిగారు. దీంతో సంజయ్ కోర్టును ఆశ్రయించాడు. షాప్ ను రాత్రికి రాత్రే స్థల ఓనర్లు అక్రమంగా కూల్చివేశారని బాధితుడు సంజయ్ ఆరోపించారు. షాప్ లోని మొబైల్స్, ఫర్నిచర్ ధ్వంసమైందని,  సుమారు రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. స్థానిక  అబిడ్స్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుండగానే షాపు కూల్చివేతకు పాల్పడడంపై వ్యాపారులు తీవ్ర నిరసన తెలిపారు. తనకు న్యాయం చేయాలని  బిల్డర్ల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు సంజయ్ కోరాడు.