5 నుంచి కొత్త జడ్పీలు, ఎంపీపీల పాలన        

5 నుంచి కొత్త జడ్పీలు, ఎంపీపీల పాలన        

వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త జిల్లా, మండల పరిషత్‌ల పాలన మొదలవుతుండటంతో ఆయా జిల్లాల్లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరిషత్‌ల కోసం బిల్డింగులను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆఫీసుల్లో ఫర్నిచర్‌ కోసం సర్కారు నిధులిచ్చింది. పరిషత్‌లలకు ఉద్యోగుల విభజన కూడా వేగవంతమైంది. 2వ తేదీ సాయంత్రం ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. 3న వారు డ్యూటీలో చేరుతారు.

అన్ని ప్రభుత్వ బిల్డింగులే..

రాష్ట్రంలో ఇప్పటివరకు 9 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. 23 కొత్త జిల్లాలతో వాటి సంఖ్య 32కు చేరుకుంది. కొత్త జిల్లాల పరిషత్‌లన్నీ ప్రభుత్వ బిల్డింగుల్లోనే ఏర్పాటవుతున్నాయి. నాలుగు జిల్లాలు మినహా మిగతా వాటిల్లో జిల్లా పరిషత్‌ల ఆఫీసులను ఎంపీడీవో, ఎంపీపీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్‌లో రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్‌ను, నాగర్ కర్నూల్‌లో స్త్రీ శక్తి భవనాన్ని, నారాయణ పేటలో వెటర్నరీ కార్యాలయం, సిద్దిపేటలో సీఎల్ ఆర్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ కార్యాలయం కోసం భవనాలను ఎంపిక చేశారు.

కొత్త జిల్లాలకే ఫర్నిచర్‌..

కొత్త జిల్లా పరిషత్‌లు, సమావేశాల నిర్వహణ కోసం ఫర్నిచర్ కొనుగోలుకు ఎంత ఖర్చు చేయాలో ఇటీవలి జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కొత్త జిల్లాల్లోనే ఫర్నీచర్ కొనాలంది. జడ్పీ సమావేశానికి చైర్లు, టేబుళ్లు, మైక్ సిస్టం కొనేందుకు జిల్లాకు రూ.5,25,000 చొప్పున ఇచ్చింది. జడ్పీ చైర్మన్ , వైస్ చైర్మన్ , సీఈవో, డిప్యూటీ సీఈవో ఆఫీసర్ల ఫర్నీచర్ కోసం అన్ని జిల్లాలకు కలిపి కోటి 40 లక్షల 58వేల రుపాయలు ఖర్చు చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ అనుమతిచ్చింది. ప్రతి జిల్లా పరిషత్ నిర్వహణకూ రూ.10 లక్షలను కేటాయించింది.

పైరవీలకు చెక్‌ …

9 జిల్లా పరిషత్‌లలోని ఉద్యోగులను 23 కొత్త జిల్లా పరిషత్‌లకు విభజిస్తున్నారు. దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ను పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేసింది. విభజన, పోస్టింగ్‌లలో పైరవీలకు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ముందుగా పోస్టింగ్ ఇస్తే పైరవీలు చేస్తారని 2వ తేదీ రాత్రి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు, సీఈవోలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రక్రియ 2వ తేదీ కల్లా పూర్తవుతుందని, 3న బాధ్యతలు చేపడతారని అధికారులు చెబుతున్నారు.

మండల పరిషత్‌లకు బిల్డింగుల కొరత..

రాష్ట్రంలోని 539 మండలాల్లో 120కి పైగా కొత్తవి. వచ్చే నెల 5నే ఇవీ అమల్లోకి వస్తున్నాయి. కొత్త మండలాల్లో బిల్డింగుల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు.