ఈ నెల 16న జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు సర్వం సిద్ధం

ఈ నెల 16న జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు సర్వం సిద్ధం

8.30 గంటల నుంచే సెంటర్​లోకి ఎంట్రీ
హాల్​టికెట్​తో పాటు ఒరిజినల్ ఐడీ తేవాలె 
టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్​రెడ్డి సూచన 
బూట్లు కాకుండా చెప్పులు వేసుకొని హాజరవ్వాలి

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 16న జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్​ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్​రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. టీఎస్​పీఎస్సీ నుంచి వచ్చే సూచనలు అమలు చేయాలని కోరారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుందని  ఆయన వెల్లడించారు. 503 పోస్టుల కోసం 3.80 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు అప్లై చేసుకున్నారని, వారి కోసం 1,019 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లపై జనార్దన్ రెడ్డి సమీక్షించారు.

అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచే హాల్​లోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థులు హాల్​టికెట్లతో పాటు ఏదైనా  ఒరిజినల్ ఐడీ ప్రూఫ్​ (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) తో సెంటర్ కు రావాలని సూచించారు. హాల్​టికెట్లను https://www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులంతా చెప్పులతో అటెండ్ కావాలని, విలువైన వస్తువులను వెంట తెచ్చుకోరాదన్నారు. సెంటర్ ఎంట్రెన్స్​లో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని లోపలికి పంపిస్తామని వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సెంటర్ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్, సభ్యులు ధన్ సింగ్,  సుమిత్రా ఆనంద్ తనోబా, రవీందర్, అరుణ కుమారి, లింగారెడ్డి, చంద్రశేఖర్​రావు, సత్యనారాయణ పాల్గొన్నారు.