గోల్వాల్కర్​ నుంచి హెగ్డే దాకా.. రిజర్వేషన్లను  వ్యతిరేకంచింది వీళ్లే : సీఎం రేవంత్​రెడ్డి

గోల్వాల్కర్​ నుంచి హెగ్డే దాకా.. రిజర్వేషన్లను  వ్యతిరేకంచింది వీళ్లే : సీఎం రేవంత్​రెడ్డి

రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్​ మూల సిద్ధాంతమని, దాన్ని 2025 నాటికి అమలు చేయాలన్నదే  బీజేపీ టార్గెట్​ అని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. వాళ్ల కుట్రలను బయటపెట్టినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్నారని, తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.  ఆర్ఎస్ఎస్​ మూలాలున్నవాళ్లు, ఆర్​ఎస్​ఎస్​ బాధ్యులైన వాళ్లు కూడా ఎన్నో సందర్భాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని స్టేట్​మెంట్లు ఇచ్చారని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. వాటి క్లిప్పింగ్స్​ను మీడియాకు చూపించారు.

‘‘ఆర్​ఎస్​ఎస్​ రెండో సత్సంగ్​ చాలక్​ మాధవ్​ సదాశివరావ్​ గోల్వాల్కర్​.. 1960లో రెండు పుస్తకాలు రాశారు. దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలని వాటిలో ఆయన స్పష్టంగా రాశారు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన రాశారు. దురదృష్టకరం అని ఆయన పేర్కొనడం ఏమిటి? ఆర్​ఎస్​ఎస్​ ఫిలాసఫర్  ఎన్​జీ వైద్య 2015 ఆగస్టు 30న (నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి) ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఏ కులాలు వెనుకబడి లేవు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా 10ఏండ్లు కొనసాగించి రద్దు చేయాలి’ అని అన్నారు. 2015లో ఆయన ఆ మాటలు అంటే.. 2025 నాటికి పదేండ్లు అవుతుంది.

ఆయన మాటలను పదేండ్లు అంటే 2025 నాటికి అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నది”అని తెలిపారు. ‘‘2017లో మోదీ కేబినెట్​లోని కేంద్ర మంత్రి అనంతకుమార్​ హెగ్డే.. ‘రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది. రానున్న రోజుల్లో అది మారనుంది. నేను ఇక్కడున్నది అందుకే. దానికోసమే వచ్చాను’ అని స్టేట్​మెంట్​ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు” అని సీఎం తెలిపారు.  మోదీ హయాంలోనే అప్పటి లోక్​సభ స్పీకర్​ సుమిత్రా మహాజన్​ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టేట్​మెంట్​ ఇచ్చారని అన్నారు.

‘‘సుమిత్రా మహాజన్​ కూడా ఓ సందర్భంలో.. ‘రిజర్వేషన్లు అభివృద్ధిని తీసుకువస్తాయా? కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్​ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అవి పదేండ్లు ఉండాల్సి ఉన్నా.. వాటిని ప్రభుత్వాలు పదేండ్ల కోసారి పెంచుకుంటూ వస్తున్నాయి. అవి దేశాన్ని అభివృద్ధి పరుస్తాయా’  అని అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆమె మాట్లాడారు” అని వివరించారు. 2017లో ఆర్​ఎస్​ఎస్​ నేత  వైద్య కూడా.. కుల ప్రాతిపాదికన ఇచ్చే రిజర్వేషన్లు తొలగించాల్సిందేనన్నారని సీఎం చెప్పారు. ఇవన్నీ ఆర్​ఎస్​ఎస్​, బీజేపీకి సంబంధించిన వాళ్లు చెప్పిన మాటలేనని.. ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. వీటిపై మోదీ, అమిత్​ షా ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు.