Prabhas: 'రాజాసాబ్' థియేటర్‍లో మంటలు.. భయంతో వణికిపోయిన ప్రేక్షకులు.. అసలేం జరిగిందంటే?

Prabhas: 'రాజాసాబ్' థియేటర్‍లో మంటలు.. భయంతో వణికిపోయిన ప్రేక్షకులు.. అసలేం జరిగిందంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై తన మార్క్ మాస్ ఎంటర్టైనర్లతో అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నారు. లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా జనవరి 9 న  'ది రాజా సాబ్' ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ స్పై థ్రిల్లర్, రణవీర్ సింగ్ నటించిన 'ధృంధర్' హవాను అడ్డుకుంటూ..  మొదటి రోజే 'రాజా సాబ్' ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

థియేటర్‌లో మంటలు..

అయితే ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఉన్న అశోక్ థియేటర్ లో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ ఎంట్రీ సీన్ సమయంలో ఉద్వేగానికి లోనైన అభిమానులు థియేటర్ లోపలే సుమారు 25 కిలోల కాగితపు ముక్కలు స్క్రీన్ పై చల్లారు. అంతటితో ఆగని అభిమానం కాస్త హద్దులు దాటింది. స్క్రీన్ ముందు  బాణసంచా కాల్చడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో ప్రేక్షకులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ థియేటర్ సిబ్బంది, అప్రమత్తమైన ఇతర అభిమానులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

అభిమానం హద్దులు దాటితే.

ఇలాంటి వారిని అభిమానులు అనకూడదు, వీరు అసాంఘిక శక్తులు. ప్రాణాలతో ఆడుకుంటూ థియేటర్ ఆస్తులను ధ్వంసం చేసే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ప్రభాస్ పేరును చెడగొట్టడమే  అని డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేష్టలతో తోటి వారికి ఇబ్బందికరంగా మారుతోంది. అభిమానం ఉండొచ్చు.. కానీ హద్దులు దాటకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ ఘటన దృష్ట్యా, థియేటర్ యాజమాన్యాలు, పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. అటు అభిమానులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చిత్ర యూనిట్ కోరుతోంది.

 

హారర్-కామెడీలో ప్రభాస్ విశ్వరూపం

'ది రాజాసాబ్' మూవీపై మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ, ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ అభిమానులను కట్టిపడేస్తోంది. సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి భారీ తారాగణం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇచ్చింది. మారుతి మార్క్ కామెడీతో పాటు గ్రాండ్ విజువల్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందంటున్నారు అభిమానులు. 

►ALSO READ | Kamal Haasan: దళపతి విజయ్‌కి అండగా కమల్ హాసన్..'జన నాయగన్'కు సెన్సార్ బ్రేక్ పై సీరియస్ !

బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

జనవరి 9న విడుదలైన ఈ చిత్రం, ఉత్తరాది మార్కెట్‌లో రణవీర్ సింగ్ 'ధృంధర్' కలెక్షన్లను వెనక్కి నెట్టడం విశేషం. కేవలం ఇండియాలోనే మొదటి రోజు సుమారు రూ.54.4 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. బాహుబలి, కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ ఖాతాలో పడిన మరో వంద కోట్ల ఓపెనర్ ఇది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.