సీజే బెంచ్ ముందుకు తీన్మార్‌‌‌‌ మల్లన్న పిటిషన్‌‌

సీజే బెంచ్ ముందుకు తీన్మార్‌‌‌‌ మల్లన్న పిటిషన్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన క్రిమినల్‌‌ కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్‌‌ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌‌ను సీజే బెంచ్ ముందుంచాలంటూ రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీన్మార్​మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర వ్యాప్తంగా100కుపైగా కేసులు నమోదు చేసిందన్నారు.

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారని, కావున ఈ కేసులను అక్కడికి బదిలీ చేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌‌రాజె వాదనలు వినిపిస్తూ.. ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఈ జీవోలో ఎంపీ, ఎమ్మెల్యేలు అని స్పష్టంగా ఉందని, ఎమ్మెల్సీల ప్రస్తావన లేదన్నారు. కావున మల్లన్న వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టాలంటే సుప్రీం కోర్టు నుంచి స్పష్టత రావాలని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కింది కోర్టుల్లో కేసుల విచారణకు 8 వారాలపాటు మల్లన్న హాజరుకు మినహాయింపునిస్తూ, ఈ పిటిషన్‌‌ను సీజే బెంచ్‌‌ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.