- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్ పల్లిలో ఘటన
- కామారెడ్డి జిల్లాలో బాబు గుర్తింపు
- తల్లితో సహా సఖి కేంద్రానికి తరలింపు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు
మెదక్, వెలుగు: నెల వయసున్న కొడుకును తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి డబ్బుల కోసం వేరే వారికి అమ్మేశాడు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్ పల్లి తండాకు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల కింద పెళ్లి జరిగింది. మొదటి భార్యను వదిలేసి ఏడాది కింద మరో పెళ్లి చేసుకున్నాడు.
ఆ దంపతులకు గత నెల కొడుకు పుట్టాడు. కాగా, తాగుడుకు బానిసైన సదరు వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో డబ్బుల కోసం పాపన్నపేట మండలం నాగ్సానిపల్లికి చెందిన ఇద్దరు మధ్యవర్తుల ద్వారా బాబును కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సంతానం లేని దంపతులకు అమ్మేశాడు. రూ.5 లక్షలకు బేరం పెట్టగా, చివరకు రూ.1.70 లక్షలకు అగ్రిమెంట్ పేపర్ రాసుకొని బాబును అమ్మేశాడు. ఈ విషయం సోమవారం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి వెళ్లగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హవేలి ఘనపూర్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లి బాబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాబుతో పాటు తల్లిని మెదక్ పట్టణంలోని సఖి కేంద్రానికి తరలించారు. బాలుడిని అమ్మిన వారితో పాటు కొన్నవారు, ఇద్దరు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
