టీచర్లను బీఎల్‌‌వో డ్యూటీల నుంచి మినహాయించాలి

టీచర్లను బీఎల్‌‌వో డ్యూటీల నుంచి మినహాయించాలి
  • సీఈవోను కోరిన తపస్ రాష్ట్ర నేతలు 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ వంటి పలు జిల్లాల్లో టీచర్లకు కేటాయించిన బీఎల్‌‌వో డ్యూటీల నుంచి వారికి తక్షణమే మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వోడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య కోరారు. అకడమిక్ ఇయర్ ముగింపు దశలో ఉన్నందున ఇంటర్నల్ పరీక్షలు, బోధనకు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

మంగళవారం హైదరాబాద్‌‌లో తెలంగాణ రాష్ట్ర సీఈవో సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అకడమిక్ క్యాలెండర్ ముగుస్తున్న ఈ తరుణంలో బడుల్లో టీచర్లు ఉండాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. టీచర్లకు ఈ ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చి, నాన్ టీచింగ్ సిబ్బందిని ఆ పనికి ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఈఓ.. ఈ సమస్యపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చినట్టు వారు చెప్పారు.