Kamal Haasan: దళపతి విజయ్‌కి అండగా కమల్ హాసన్..'జన నాయగన్'కు సెన్సార్ బ్రేక్ పై సీరియస్ !

Kamal Haasan: దళపతి విజయ్‌కి అండగా కమల్ హాసన్..'జన నాయగన్'కు సెన్సార్ బ్రేక్ పై సీరియస్ !

తమిళ సినీపరిశ్రమలో ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం చూట్టూ వివాదం నడుస్తోంది. రోజురోజుకు  ఈ వివాదం పెను రాజకీయ తుఫానుగా మారుతోంది.  ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న ఈ చివరి చిత్రం విడుదలపై సెన్సార్ బోర్డ్ ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో విజయ్‌కు మద్దతుగా విశ్వనటుడు, ఎంపీ కమల్ హాసన్ గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్వేచ్ఛను అడ్డుకోలేరు..

 'జన నాయగన్' సెన్సార్ వివాదంపై రాజ్యసభ సభ్యుడి హోదాలో కమల్ హాసన్ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. "కళ కోసం, కళాకారుల కోసం, రాజ్యాంగం కోసం" అంటూ ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి శ్రమ కాదు; రచయితలు, సాంకేతిక నిపుణులు, ప్రదర్శకులు, చిన్న వ్యాపారుల జీవనోపాధి. పారదర్శకత లేని నిర్ణయాల వల్ల సృజనాత్మకత దెబ్బతినడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది అని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ ప్రక్రియలో సంస్కరణలు రావాలని, కట్స్ లేదా మార్పులు సూచించినప్పుడు దానికి తగిన కారణాలను లిఖితపూర్వకంగా వివరించాలని ఆయన డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

తెర వెనుక ఏం జరిగింది?

కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 5వ తేదీ వరకు అంతా సజావుగానే ఉంది. డిసెంబర్‌లోనే సినిమాను చూసిన ఎగ్జామినింగ్ కమిటీ, 'UA 16+' సర్టిఫికేట్ ఇస్తామని ఈమెయిల్ ద్వారా ధృవీకరించింది. కానీ, సినిమా విడుదల కావడానికి కేవలం నాలుగు రోజుల ముందు, సినిమాను 'రివైజింగ్ కమిటీ'కి పంపుతున్నట్లు బోర్డు బాంబు పేల్చింది. దీనిపై నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమాకు వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే, సెన్సార్ బోర్డు ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో.. కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేయడంతో  'జన నాయగన్' రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇది విజయ్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.

రాజకీయ కోణమే కారణమా?

విజయ్ తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 'జననాయగన్' చిత్రంలో రాజకీయ అవినీతిని ప్రశ్నించే సీన్లు ఉన్నాయని, అందుకే కావాలనే సెన్సార్ బోర్డు అడ్డుపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయ్ సినీ కెరీర్‌లో ఆఖరి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

►ALSO READ | Raja Saab Box Office: బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ విన్యాసం.. తొలిరోజు 'రాజా సాబ్' కలెక్షన్స్ ఎంతంటే?

సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, విజయ్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో #ReleaseJanaNayagan అంటూ హోరెత్తిస్తున్నారు. కమల్ హాసన్ వంటి దిగ్గజాలు తోడవ్వడంతో ఈ వివాదం ఇప్పుడు సినీ రంగం దాటి రాజకీయ రంగు పులుముకుంది. జనవరి 21న కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.