Raja Saab Box Office: బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ విన్యాసం.. తొలిరోజు 'రాజా సాబ్' కలెక్షన్స్ ఎంతంటే?

Raja Saab Box Office: బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ విన్యాసం.. తొలిరోజు 'రాజా సాబ్' కలెక్షన్స్ ఎంతంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ కు పూనకాలే.. రికార్డులు తిరగరాయాల్సిందే. తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'.  సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. అనేక అడ్డంకులు , మిశ్రమ స్పందనల మధ్య కూడా ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

అడ్డంకులను దాటి.. రికార్డుల వేట!

తెలంగాణలో ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు, టికెట్ రేట్ల పెంపు రద్దు కావడం, బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కావడం వంటి సమస్యలు ఎదురైనప్పటికీ, ప్రభాస్ క్రేజ్ ముందు అవేవీ నిలవలేదు.  ఒక్క తెలంగాణ మినహా ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోలు, టికెట్ల ధర పెంపు కొనసాగడంతో ఈ మూవీ వసూళ్లలో కొంత కలిసివచ్చింది.  తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 112 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ప్రముఖ సినీ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ ప్రకారం..  నైజాం ఏరియాలోనే రూ19 నుంచి -22 కోట్ల గ్రాస్ వసూలు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.  విదేశీ మార్కెట్‌లోనూ రాజా సాబ్ హవా నడిచింది. సుమారు రూ.26 కోట్ల వసూళ్లతో యూఎస్, ఇతర దేశాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. . ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, కేరళలోనూ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక్క శుక్రవారమే రూ. 54.15 కోట్లు వసూలు చేసింది. ప్రత్యేక షోల ద్వారా అదనంగా రూ. 9.15 కోట్లు రాబట్టింది. దీంతో  ఇండియాలో పెయిడ్ ప్రివ్యూలతో కలిపి రూ. 63.3  కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

 

హారర్ ఫాంటసీలో సరికొత్త బెంచ్‌మార్క్

భారతీయ సినిమా చరిత్రలో ఒక హారర్ ఫాంటసీ చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి. 2025లో వచ్చిన భారీ ఓపెనర్ 'ఛావా' వసూళ్లు చేసిన రూ.31 కోట్లు రికార్డును రాజా సాబ్ సునాయాసంగా తుడిచిపెట్టేసింది. ప్రభాస్ కెరీర్‌లో ఇది ఆరో రూ.100 కోట్ల ఓపెనర్ గా నిలిచింది.

►ALSO READ | Parasakthi Review: పరాశక్తి రివ్యూ: శివకార్తికేయన్ మెప్పించారా?.. నెటిజన్ల ఆగ్రహానికి కారణమేంటి?

టాక్ ఎలా ఉన్నా.. ప్రభాస్ వన్ మ్యాన్ షో!

సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కథనం 'క్రింజ్'గా ఉందని కొందరు విమర్శిస్తున్నప్పటికీ, ప్రభాస్ వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్ , ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథ ఎలా ఉన్నా ప్రభాస్ కోసం చూడొచ్చు అనే టాక్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. తెలుగులో 57 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, హిందీ, తమిళ వెర్షన్లలో వసూళ్లు కాస్త నెమ్మదిగా ఉన్నాయి. అయితే వీకెండ్ కావడంతో హిందీ బెల్ట్‌లో కూడా వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ముందున్న అసలైన పరీక్ష!

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సలార్, కల్కి 2898 AD చిత్రాలు ఘనవిజయం సాధించినా, విమర్శకుల ప్రశంసల విషయంలో మిశ్రమ ఫలితాలనే అందుకున్నాయి. ఇప్పుడు 'రాజా సాబ్' పరిస్థితి కూడా అలాగే ఉంది. శని, ఆదివారాల్లో ఈ వసూళ్లు స్థిరంగా కొనసాగితేనే సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదలకు సిద్ధమవుతుండటంతో, రాజా సాబ్ ఆ పోటీని ఎలా తట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.  నెగటివ్ రివ్యూలను పక్కన పెట్టి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తన సినీరాజ్యాన్ని ఏలుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.