మంచిర్యాల అగ్రికల్చర్ ఆఫీస్లో.. అటెండర్ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల అగ్రికల్చర్  ఆఫీస్లో.. అటెండర్  ఆత్మహత్యాయత్నం
  •     డీఏవో వేధింపులే కారణమని బాధితుడి భార్య ఆరోపణ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కలెక్టరేట్​లోని జిల్లా అగ్రికల్చర్  ఆఫీసులో అటెండర్ గా పని చేస్తున్న శ్రీనివాస్  మంగళవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. డీఏవో సురేఖ వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని బాధితుడి భార్య శ్రీలక్ష్మి ఆరోపించారు. ప్రస్తుతం శ్రీనివాస్  జిల్లా కేంద్రంలోని ప్రైవేట్  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయమై డీఏవోను వివరణ కోరగా.. తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తాను ఆఫీస్​కు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరని, తాళం కూడా తీయలేదని, సూపరింటెండెంట్ వసంత్ కు ఫోన్ చేసి అడిగానని చెప్పారు. ఆ తర్వాత కొద్ది సేపటికి శ్రీనివాస్ హడావుడిగా వచ్చి తాను ఇక్కడ పని చేయలేనని, రాజీనామా లెటర్  రాసి ఇవ్వగా తాను నిరాకరించినట్టు చెప్పారు. దీంతో శ్రీనివాస్  ఆఫీస్​లో ఉన్న పురుగు మందు శాంపిల్  డబ్బా తీసుకొని ఆత్మహత్య  చేసుకుంటానంటూ నోట్లో పోసుకున్నాడని తెలిపారు. వెంటనే తాను 108 అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం అందించానని చెప్పారు. శ్రీనివాస్ ను మొదట మంచిర్యాల గవర్నమెంట్  హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.

డీఏవో వేధింపుల వల్లే... 

శ్రీనివాస్  భార్య శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. డీఏవో సురేఖ వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపించారు. ఆఫీస్​లో ముగ్గురు అటెండర్లు ఉండాల్సి ఉండగా, ఒకరు అబ్ స్కాండింగ్​లో ఉన్నారని, మరొకరు మహిళ కావడంతో అన్ని పనులు తన భర్తకే చెప్తున్నారని వాపోయారు. రాత్రి 8 గంటల వరకు పని చేయించుకుంటున్నారని, డీఏవో సురేఖ ‘నాన్సెన్స్, ఇడియట్, నీకు ఏ పనీ రాదు’ అని తిడుతూ వేధిస్తున్నారని తెలిపారు. గతంలో చెన్నూర్ ఏడీఏ ఆఫీస్​లో పని చేసిన శ్రీనివాస్  రెండేండ్లుగా డీఏవో ఆఫీస్​లో డ్యూటీ చేస్తున్నాడు. కాగా, కలెక్టర్  కుమార్  దీపక్  ఆదేశాల మేరకు శ్రీనివాస్ ను సస్పెండ్  చేసినట్లు సమాచారం.