- హైదరాబాద్ జేఏసీ ఆఫీసులో విశారదన్ నిరాహార దీక్ష
ముషీరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ స్పష్టం చేశారు. ఖమ్మంలో పోలీసులు అరెస్టు చేసి విశారదన్ను హైదరాబాద్ జేఏసీ ఆఫీస్ కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జేఏసీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విశారదన్ మాట్లాడుతూ.. భూదాన్ బోర్డు భూముల్లో 40 ఏండ్లుగా నివసిస్తున్న పేదల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు అండగా నిలిచిన జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు పేదలపై ప్రేమ లేదని, భవిష్యత్తులో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బాధితులకు అక్కడే పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించాలని, అరెస్టయిన 15 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బాధితులకు న్యాయం జరిగేదాకా నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రక టించారు.
ఈ దీక్షకు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య మద్దతు తెలుపారు. పేదల పక్షాన పోరాడుతున్న విశారదన్ ను అభినందించారు. కార్యక్రమంలో అన్నెల లక్ష్మణ్, రాఘవేంద్రరావు తదితురులు పాల్గొని, సంఘీభావం తెలిపారు.
