హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై నేడు యూపీఎస్సీ నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం.. బుధవారం ఢిల్లీ ధోల్పూర్ హౌస్ యూపీఎస్సీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న సీఎస్ రామకృష్ణారావు హాజరుకానున్నారు. కనీసం 6 నెలల పదవీకాలం ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు 1992 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖాగోయల్, సౌమ్యమిశ్రా పేర్లు ప్రభుత్వం పంపిన జాబితాలో ఉన్నట్లు సమాచారం.
లిస్టులో ఇన్చార్జి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 30న ఆయన ఉద్యోగ విరమణ పొందనుండగా.. పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించే చాన్స్ ఉంది. ఈ క్రమంలో పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై యూపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
