కడియం,దానంకు క్లీన్ చిట్ ప్రజాస్వామ్యంపై దాడి: కేటీఆర్

కడియం,దానంకు క్లీన్ చిట్  ప్రజాస్వామ్యంపై దాడి: కేటీఆర్

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనన్నారు.  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని చెప్పారు.  

ఇది కేవలం ఒక తీర్పు కాదు అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకున్నారని అన్నారు కేటీఆర్. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే  ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు కేటీఆర్.  ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు.తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో సమాధానం చెబుతామని కేటీఆర్ అన్నారు.

దానం,కడియంకు క్లీన్ చిట్

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ లను   డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ మార్చి 11న  తుది తీర్పు ఇచ్చారు.  ఈ ఇద్దరిపై గతవారమే స్పీకర్ విచారణను ముగించి  తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఈ క్రమంలో  ఇవాళ స్పీకర్ తుది తీర్పు ఇచ్చారు.  ఇదే ఆరోపణలపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. ఇవాళ దానం, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు.