Parasakthi Review: పరాశక్తి రివ్యూ: శివకార్తికేయన్ మెప్పించారా?.. నెటిజన్ల ఆగ్రహానికి కారణమేంటి?

Parasakthi Review: పరాశక్తి రివ్యూ: శివకార్తికేయన్ మెప్పించారా?..  నెటిజన్ల ఆగ్రహానికి కారణమేంటి?

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియడ్ డ్రామా ' పరాశక్తి' (Parasakthi). ఎన్నో వివాదాలు, అడ్డంకులను తట్టుకుని ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న 2026న థియేటర్లలోకి వచ్చింది.  ‘ఆకాశమే హద్దురా’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి రోజు మార్నింగ్ షోల తర్వాత మిశ్రమ స్పందన (Mixed Talk) వినిపిస్తోంది.

కథా నేపథ్యం

ఈ సినిమా 1960ల నాటి మద్రాసు , పొళ్ళాచి నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా 1965లో తమిళనాడులో జరిగిన 'హిందీ వ్యతిరేక ఉద్యమం' చుట్టూ కథను అల్లారు దర్శకురాలు సుధా కొంగర.  శివకార్తికేయన్ రైల్వే ఉద్యోగిగా సామాన్య మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపిస్తే, అథర్వ మురళి అతని తమ్ముడిగా, ఉద్యమకారుడిగా నటించారు. దేశం మొత్తం హిందీని తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేసిన పోరాటం, ఆ క్రమంలో ఒక కుటుంబంలో తలెత్తే విభేదాలు, భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించారు. అప్పట్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి నాయకుడు 'రాజేంద్రన్' జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయని చెప్పుకొస్తున్నారు.

ఇంటర్వెల్ అదిరింది.. కానీ!

సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  సినిమా సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుందంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శివకార్తికేయన్, అథర్వ మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. రవి మోహన్ (జయం రవి) విలన్‌గా తన నటనతో భయపెట్టారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. శ్రీలీల తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. అయితే సినిమా కథనం నెమ్మదిగా సాగడం ప్రధాన మైనస్‌గా అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ చాలా లెంగ్తీగా ఉండటం, కొన్ని చోట్ల డాక్యుమెంటరీలా అనిపించడం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించిందన్నా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

ఓపికను పరీక్షించేలా.. 

ఈ  ' పరాశక్తి'  మూవీ మొదటి గంట సేపు ఓపికను పరీక్షిస్తుందన్న అభిప్రాయం సినీ ప్రియలలో వ్యక్తం అవుతోంది.. కానీ ఇంటర్వెల్ సీన్స్ అద్భుతంగా ఉందంటున్నారు. రాజకీయ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ కనెక్ట్ కాకపోవచ్చని మరికొందరు తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు.   ముఖ్యంగా శివకార్తికేయన్ - శ్రీలీల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కథకు అడ్డుతగిలాయని, ఓపికను పరీక్షిస్తాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సెకండాఫ్ అంతా డాక్యుమెంటరీలా సాగిపోవడంతో కమర్షియల్ హంగులు ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

 

బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ

తమిళనాడులో విజయ్ నటించిన ‘జన నాయగన్’ వాయిదా పడటంతో ‘పరాశక్తి’కి భారీగా థియేటర్లు దక్కాయి. అయితే, తెలుగులో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ తో ఈ సినిమా పోటీ పడాల్సి వస్తోంది. దాదాపు రూ. 142 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తెలుగు నెటిజన్ల ఆగ్రహం!

సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఒక వివాదం తెరపైకి వచ్చింది. తమిళ వెర్షన్‌లో తెలుగు వారిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర పదాలు వాడారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సెన్సార్ బోర్డు ఈ పదాన్ని మ్యూట్ చేసినప్పటికీ, ఆ సన్నివేశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలుగు మూలాలున్న సుధా కొంగర దర్శకత్వంలో ఇలాంటి సన్నివేశం ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

చూడవచ్చా? లేదా?

మీరు పీరియడ్ డ్రామాలు, చారిత్రక అంశాలు, ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వారైతే ‘పరాశక్తి’ ఒక మంచి ఎంపిక. కానీ, కేవలం కమర్షియల్ మాస్ మసాలా కోరుకునే వారికి ఈ సినిమా కాస్త నిరాశ కలిగించవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది..