హైదరాబాద్: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మాజీ ఐపీఎస్ భార్య రూ. 2.58 కోట్లు మోసపోయిన ఘటన హైదరాబాద్ సిటీలో కలకలం రేపింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని వాట్సాప్ నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. తనకు అవగాహన లేక తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారిని) వాట్సాప్ గ్రూప్‌లో ఆమె యాడ్ చేయించారు. 500 శాతం లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్ళు నమ్మించారు. బాధితులకు సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అని ఒక లింక్ పంపి ఈ సైబర్ నేరగాళ్లు నమ్మించారు.
వాట్సాప్లో సెబీ నకీలీ సర్టిఫికెట్లు పంపించారు. ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24న నుంచి ఈనెల 5వ తేదీ వరకూ 19 ట్రాన్సాక్షన్లలో ఈ మాజీ ఐపీఎస్ భార్యతో రూ. 2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. ఇన్వెస్ట్మెంట్ ఆపేయడంతో మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టాలని నేరగాళ్లు ఒత్తిడి చేశారు. ఇన్వెస్ట్ చేయకపోతే ఇప్పటివరకూ పెట్టిన డబ్బు పోతుందని బెదిరించారు. మోసమని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత డిసెంబర్ నెలలో హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు భారీగా వెలుగుచూశాయి. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ కు 266 ఫిర్యాదులు రాగా.. 144 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటిలో 34 కేసుల్లో ప్రమేయం ఉన్న 15 రాష్ట్రాలకు చెందిన 43 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయా కేసుల్లో 19 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, 8 డిజిటల్ అరెస్ట్, 3 సోషల్ మీడియా ఫ్రాడ్, బిజినెస్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, హ్యాకింగ్, ప్రైవసీ కేసులు ఒక్కొక్కటి ఉన్నాయని సైబర్ క్రైం తెలిపింది.
►ALSO READ | ఒకేసారి ఇంత విషం పెట్టి చంపేయండి: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బాధితులకు మొత్తం రూ.1.33 కోట్లు రిఫండ్ చేశామన్నారు. జోనల్ సైబర్ సెల్లో 2,195 ఫిర్యాదులు రాగా.. 80 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని తెలిపారు. సైబర్ సెల్ ఫిర్యాదులలో దేశవ్యాప్తంగా 13 కేసుల్లో ప్రమేయం ఉన్న 15 మంది సైబర్ నేరగాళ్లకు అరెస్ట్ చేసి, బాధితులకు మొత్తం రూ.72.36 లక్షలు రిఫండ్ చేశామని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో ఒక సైబర్ చీటర్పై దేశవ్యాప్తంగా 119 కేసులున్నాయని, రూ.73 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని సైబర్ క్రైం పోలీసులు చెప్పడంతో సిటీ జనం విస్తుపోయారు.
