విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ రూ.47,776.50 కోట్ల ప్రాజెక్టులను చేపట్టినా పట్టించుకోని కృష్ణా బోర్డు.. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నదని ప్రభుత్వం మండిపడింది. శ్రీశైలం ఆధారంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కోటాకు మించి నీటి మళ్లింపులకు చేపడుతున్న ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, విభజన చట్టంలోని 84(3)(II), 85(8)(d) సెక్షన్లను ఉల్లంఘించి నిర్మిస్తున్నదని పేర్కొంది. కృష్ణా జలాలను వినియోగించుకునేలా కృష్ణా పరీవాహకంలోనే ఆ ప్రాజెక్టులపై ముందుకు వెళ్తున్నామని తెలిపింది.
ఈ ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి..
ఏపీ 290 టీఎంసీల కృష్ణా జలాలను అవుట్ సైడ్ బేసిన్‌కు తరలించేలా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని లేఖలో ఈఎన్సీ ఆరోపించారు. కర్నూలు, కడప జిల్లాల్లో తెలుగుగంగ కింద రెండో పంట కోసం 15 టీఎంసీలు, హంద్రీనీవా ఎక్స్టెన్షన్కు 6 టీఎంసీలు, హంద్రీనీవా కింద రెండో పంట కోసం 28 టీఎంసీలు, పరిశ్రమల అవసరాలు, చెరువులను నింపేందుకు, తాగునీటి కోసం 20.69 టీఎంసీలు, వెలిగొండ ప్రాజెక్టుకు 2.66 టీఎంసీలు, గాలేరు నగరి కింద రెండో పంట కోసం 26.6 టీఎంసీలు, గాలేరు నగరి లిఫ్ట్‌కు 15.8 టీఎంసీల చొప్పున 114.75 టీఎంసీల తరలింపునకు ఏపీ ప్రాజెక్టులు చేపడుతున్నదని పేర్కొన్నారు.
►ALSO READ | ప్రైవేట్ స్కూల్ ఫీజు.. 2 ఏళ్లకు 8 శాతం మాత్రమే పెంచాలి..!
వాటితో పాటు వరికపుడిశల స్కీమ్ (ఫేజ్ 1, 2) కింద 7.867 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ ఎక్స్టెన్షన్కు 78 టీఎంసీలు, గుంటూరు చానెల్ అదనపు ఆయకట్టుకు 1.3 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ఎక్స్టెన్షన్ కోసం 15 టీఎంసీలు, తుంగభద్ర హైలెవెల్ కెనాల్‌తో 25 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ ద్వారా గుండ్లకమ్మ, మూసీ, పాలేరులకు 20 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కింద రెండో పంట కోసం 19 టీఎంసీలు, సిద్ధాపురం లిఫ్ట్ కింద 2 టీఎంసీలు, వేదవతి లిఫ్ట్‌కు 8.29 టీఎంసీల చొప్పున నీళ్లను తీసుకుపోయే ప్రాజెక్టులకు ఏపీ ప్లాన్ చేస్తున్నదని పేర్కొన్నారు. అవన్నీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా చేపడుతున్నవేనని తేల్చి చెప్పారు. బేసిన్లో ఉన్న రాష్ట్రాల అవసరాలు తీరకుండా.. ఔట్‌సైడ్ బేసిన్‌కు తరలిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 43 శాతం వరకు ఔట్‌సైడ్ బేసిన్‌కు తరలిస్తున్నదని కృష్ణా ట్రిబ్యునల్ కూడా గుర్తించిందన్నారు. కాబట్టి, ఏపీ చేపడుతున్న ఆ అక్రమ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు దృష్టి సారించాలని, వాటిని చేపట్టకుండా ఏపీని నిలువరించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా, విస్తరణలు చేయకుండా ఏపీని అడ్డుకోవాలన్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంపై కేంద్రానికి బోర్డు లేఖ రాయాలని ఆయన తేల్చి చెప్పారు.
